ఆస్తి కోసం వృద్ధురాలిని చిత్రహింసలు పెట్టిన మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్తి కోసం వృద్ధురాలిని చిత్రహింసలు పెట్టిన మహిళ

April 16, 2018

రోజురోజుకు మనుషులు రాళ్ళుగా మారుతున్నారా ? అంటే నిజమే అంటారు ఈ ఘటన చూశాక. మంచంపై ఉన్న వృద్ధురాలిని ఆమె తోబుట్టువు వరసైన మహిళ ఘోరంగా హింసిస్తూ మానవత్వాన్ని మంట గలిపింది. కాలు, చెయ్యి పడిపోయిన ఓ నిస్సహాయ వృద్ధురాలిని ఇష్టమొచ్చినట్టు కొట్టింది ఓ మహిళ. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ హౌసింగ్‌బోర్డు కాలనీలో వెలుగు చూసింది. వృద్ధురాలిని చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలను సమీపంలో నివసిస్తున్న ఒక యువకుడు తన సెల్‌ఫోన్‌ చిత్రీకరించి బయటకు విడుదల చేయడంతో కలకలం రేగింది. రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన పంతం పుష్పవతి భర్త చనిపోవడం, పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటోంది. అదే గ్రామంలో నివసిస్తున్న తన చెల్లెలు వరసైన మంగాదేవి వద్ద ఆశ్రయం పొందుతోంది. పుష్పవతి పేరున స్థలం ఉండటంతో తనకు దక్కుతుందన్న ఆశతో ఆమెకు మంగాదేవి సేవ చేస్తోంది. రెండేళ్ల క్రితం పుష్పవతి కాలు, చెయ్యి పడిపోవడంతో మంచానికే పరిమితమైంది.

మూడు నెలల క్రితం మంగాదేవి హౌసింగ్‌బోర్డు కాలనీలో అద్దెకు వచ్చింది. స్థలం తన పేరున రాయమని పుష్పవతిని తరచు అడగటం.. అందుకు పుష్పవతి నిరాకరించడంతో మంగాదేవి .. పుష్పవతిని హింసించడం మొదలు పెట్టింది. కొడుతూ.. తిడుతూ.. బాధలుపెట్టేది. నాలుగు రోజుల క్రితం చిత్రహింసలు పెడుతుండగా ఒక యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీయడంతో విషయం బయటకు పొక్కింది. హృదయ విదారకంగా ఉన్న ఈ దృశ్యాలు చూసి పలువురు చలించిపోయారు. నిర్బయ సేవా సొసైటీ మహిళా సంఘం నాయకులు ఆ వృద్ధురాలిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చి మంగాదేవిని పోలీసులకు అప్పగించారు.