యూట్యూబ్‌లో వ్యూస్ రావడం లేదని కాల్పులు! - MicTv.in - Telugu News
mictv telugu

యూట్యూబ్‌లో వ్యూస్ రావడం లేదని కాల్పులు!

April 4, 2018

అమెరికాలోని  యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పులకు పాల్పడింది దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన  మహిళ నసీమ్ అగ్దమ్‌గా గుర్తించారు. నసీమ్ ఫొటోను పోలీసులు విడుదల చేశారు. ఘటన అనంతరం ఆమె తననుతాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు నసీమ్‌ సోషల్‌మీడియా ఖాతాలను, ఆమెకు చెందిన ఓ వెబ్‌సైట్‌ను పరిశీలించారు.  నసీమ్‌కు యూట్యూబ్‌లో ఓ చానల్‌ కూడా ఉంది. దాని ద్వారా జంతువుల హక్కులు, వాటి రక్షణకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుంటుంది. అయితే ఈ వీడియోలకు వ్యూస్‌ రాకుండా యూట్యూబ్‌ నియంత్రిస్తోందని నసీమ్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. అందుకే ఈ ఘాతుకానికి పాల్పడిందని అమెరికా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ‘యూట్యూబ్, ఇతర వీడియో షేరింగ్‌ సైట్లలో సమాన అవకాశాలు లేకుండా పోయాయి. ఈ ప్రపంచంలో మాట్లాడే స్వేచ్ఛ లేదు. వ్యవస్థకు వ్యతిరేకంగా నిజాలు చెప్తే తొక్కేస్తున్నారు’ అని నజీమ్‌ తన వెబ్‌సైట్లో రాసుకున్నట్లు తెలుస్తోంది.