పరమ చెత్త టాప్‌టెన్ పాస్‌వర్డ్స్.. - MicTv.in - Telugu News
mictv telugu

పరమ చెత్త టాప్‌టెన్ పాస్‌వర్డ్స్..

February 6, 2018

తాళం చెవితోనే తాళం పడే రోజులకు కాలం చెల్లింది. పాస్‌వర్డ్‌‌తో లాక్ ఓపన్ చేసే రోజుల్లో వున్నాం మనం. తాళం, తాళంచెవి అనే సిద్ధాంతం ఇప్పుడు అన్నీ అకౌంట్ల మీద  పడింది. అవీ ఇవీ అని గందరగోళంగా అకౌంట్లు వుండటంతో చాలా మంది తేలికగా వుండి, గుర్తుండే విధంగా పాస్‌వర్డ్‌లు పెడుతుంటారు. అలాంటివి పరమ చెత్త, నీచ, నికృష్ట పాస్‌వర్డ్‌లు అని ‘స్ప్లాష్‌ డేటా’ ఆన్‌ లైన్‌ సంస్థ సర్వే నిర్వహించింది. పాస్‌వర్డ్‌లపై సైబర్‌ నేరాలు పెరిగిపోడానికి పరమచెత్త పాస్‌‌వర్డ్సే కారణమని తేల్చి చెప్పింది.

రీఛార్జ్‌ల నుండి మొదలు పెడితే మొబైల్ ఫోన్, ఫేస్‌బుక్, వైఫై, బ్యాంక్ అకౌంట్, లాప్‌టాప్, ఏటీఎం, ఈమెయిల్, ఫేస్‌బుక్, డిజిటల్ లాకర్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, డోర్ లాక్, బీరువా లాక్ వరకు పాస్‌వర్డ్‌లే తాళం చెవులు. కొన్ని ఆర్థిక లావాదేవీలను కాపాడితే, కొన్ని వ్యక్తిగత వివరాలను గోప్యంగా వుంచుతాయి.

ఇలాంటి పాస్‌వర్డ్‌లను వాటిపై అవగాహన ఉన్న వారు సులభంగా తస్కరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ క్రమంలో అకౌంట్ ఏదైనా అస్సలు పెట్టకూడని ‘బ్యాడ్‌ పాస్‌ వర్డ్స్‌’లో టాప్ టెన్ గురించి వెల్లడించింది. అవేంటో చూద్దాం…

  • ‘123456’ అనే పాస్‌వర్డ్ ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌‌వర్డ్‌. దీనిని చాలా మంది పాస్‌వర్డ్‌గా వాడుతున్నారు. 
  • రెండో అతి చెత్త పాస్‌‌వర్డ్‌‌గా ‘ పి.ఎ.ఎస్‌.ఎస్‌.డబ్ల్యు.ఒ.ఆర్‌.డి ‘ పాస్‌‌వర్డ్‌.  దీన్ని వాడేవారిలో.. పాస్ వర్డ్ అంటే పాస్ వర్డ్ అనే పదాలు కొట్టాలేమో అనుకునే అమాయక చక్రవర్తులు కొందరున్నారంట..  
  • ఇక మూడో చెత్త పాస్‌వర్డ్‌గా ‘12345678’ . వరుస అంకెలను వినియోగించేవారు కూడా చాలా మంది ఉన్నారు.  
  • నాలుగో చెత్త పాస్‌వర్డ్‌గా కీబోర్డులో వరుసగా ఉండే qwerty అక్షరాలను వాడుతున్నారు.  
  • ఐదో స్థానంలో ‘12345’ పాస్ వర్డ్ నిలిచింది. 
  • ఆరో స్థానంలో ‘123456789’ పాస్‌వర్డ్ నిలబడింది.
  • ఏడో స్ధానాన్ని ‘వాట్ ఎవర్ ’ సంపాదించుకుంది.
  • ఎనిమిదో స్థానాన్ని ‘1234567’ దక్కించుకుంది.
  • తొమ్మిదో  స్థానంలో ‘111111’ వుంది.  
  • పదవ స్థానంలో ‘ డ్రాగన్‌ ’ పదం నిలిచింది.  

 

ఈ పాస్‌వర్డ్‌లను విరివిగా ఉపయోగించడం వల్లే సైబర్ దాడుల బారిన ఎక్కువ మంది పడుతున్నారని స్ప్లాష్ డేటా వెల్లడించింది. మనకు తేలికగా అనిపించే నెంబర్లను పెట్టుకుని  ఇబ్బంది పడకుండా స్పెషల్ క్యారెక్టర్లు, పదాలు, నెంబర్లను ఎంచుకొని అవి గుర్తు లేకపోతే గూగుల్ కీప్ అనే యాప్‌లో గానీ, డైరీలో గానీ రాసి పెట్టుకుంటే బాగుంటుందంటున్నారు.