ఈ ముగ్గురిదీ ఒకే కథ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ముగ్గురిదీ ఒకే కథ

March 26, 2018

కుచ్ హట్కే సోంచ్‌నా.. రొటీన్‌గా వెళుతున్న తెలుగు సినిమాకు కొత్త దారులు చూపించాలి.. కొత్త కథలు కావాలి.. కమర్షియల్ జోలికి వెళ్ళకుండా మంచి కంటెంట్‌తో హిట్ కొట్టాలి.. దీనికి ఆరంభం ఎక్కడినుంచి? జీవితాల్లోంచి కథలను తవ్వి తీయటానికి పూనుకుంటున్న దర్శకులు ఏ మట్టి నుంచి వస్తారు? ఇన్ని ప్రశ్నలకు, ఎదురుచూపులకు ఒక్కొక్కటిగా సమాధానాలుగా తెర మీదకు వస్తున్నాయి.  2016, 17, 18 ఈ మూడు సంవత్సరాలు సత్తా వున్న తెలంగాణ దర్శకులను వెలుగులోకి తెచ్చాయి. తెలుగు సినిమాకు కొత్త తొవ్వలు చూపాయి.ఈ మూడేళ్ళలో తెలంగాణ ప్రాంతం నుంచి ఐదుగురు సృజనాత్మక దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. వారిలో ‘పెళ్ళి చూపులు’ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్, ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి, ‘ అప్పట్లో ఒకడుండేవాడు ’ దర్శకుడు సాగర్ కె చంద్ర, ‘ అర్జున్ రెడ్డి ’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాగా, ఈ ఏడాది ‘ నీదీ నాదీ ఒకే కథ ’ అనే మంచి సినిమాతో  బోణీ కొట్టిన యంగ్ దర్శకుడు వేణు ఊడుగుల. ఈ ఐదుగురిలో తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, వేణు ఊడుగులది వరంగల్ జిల్లా అవటం విశేషం. ఘన చరిత్ర కలిగిన వరంగల్ ప్రాంతం నుంచి ఈ ముగ్గురు దర్శకులు తమదైన కలలను కళ్ళల్లో నింపుకొని వచ్చారు. కలలు కన్నారు నిజం చేసుకోవడమే కాదు సినిమాకు కొత్త భాష్యం కూడా చెప్పారు. ఈ ముగ్గురిదీ ఒకే కథ.. వారి గురించి మరింత క్లుప్తంగా తెలుసుకుందాం..

తరుణ్ భాస్కర్ :‘పెళ్ళి చూపులు’ సినిమాతో ఇండస్ట్రీ చూపులను తనవైపు తిప్పుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. అతను పుట్టింది వరంగల్‌లోనే. తండ్రిది వరంగల్, తల్లిది తిరుపతి. రెండు ప్రాంతాల నేపథ్యాలు కలిగిన తరుణ్ భాస్కర్ హైదరాబాదులో పెరిగాడు. తరుణ్ భార్య పేరు లత. ఆమె కొన్ని యాడ్‌ఫిల్మ్స్ చేసింది. భాస్కర్ తొలుత పెళ్ళి వీడియోలు తీసేవాడు. తర్వాత షార్ట్‌ఫిల్మ్స్ చేద్దామనుకున్నాడు. ఆ క్రమంలో జర్నీ, సెరెండిపిటీ, మినిట్స్‌ టు మిడ్‌నైట్‌, అనుకోకుండా, సైన్మా వంటి లఘు చిత్రాలను రూపొందించాడు. వీటిలో కొన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంఫాల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి చిత్రోత్సవాలకు ఎంపికయ్యాయి. ‘జునూన్’ అనే సినిమాకు పీపుల్స్ చాయిస్ అవార్డు వచ్చింది. ‘ సైన్మా ’ షార్ట్‌ఫిల్మ్ చూసి నటి మంచులక్ష్మి స్పందించి తరుణ్‌కు తన సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేయమని కోరింది. ఆ సినిమా పూర్వ నిర్మాణ దశలో వుండగా తరుణ్ నాన్నగారు చనిపోవటంతో ఆ సినిమాకు పనిచేయలేకపోయారు.

కొంతకాలం తర్వాత ‘పెళ్ళి చూపులు’ కథను పట్టుకొని కొంతమంది నిర్మాతలను కలిసాడు. కానీ చాలామంది ఆ కథలో కమర్షియల్ అంశాలు లేవని రిజెక్ట్ చేశారు. అయినా నిరాశ పడకుండా ప్రయత్నించాడు. అలా విజయ దేవరకొండ పరిచయం, ఆ పరిచయంతో నిర్మాత రాజ్ కందుకూరిని కలిసి కథ వినిపించడం, చకచకా నిర్మాణం జరగటం, సినిమా విడుదల అవటం, పెద్ద హిట్ అవటం అన్నీ అలా అలా జరిగిపోయాయి. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్ సంస్థలో తన రెండవ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు తరుణ్.

సందీప్ రెడ్డి వంగా :తెలిసిన రొటీన్ కథే. కానీ ఆ కథను కొత్తగా ఎలా చెప్పాలనుకుని చేసిన ప్రయత్నమే ‘ అర్జున్ రెడ్డి ’. ఈ సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు ఫ్రెష్ ఫీలింగ్‌తో బయటకు వచ్చాడు. తెలంగాణ యాస అంటే ఇన్ని రోజులూ చిన్నచిన్న, విలువల్లేని పాత్రలకు ఆపాదించారు. సినిమా మొత్తం హీరో తెలంగాణ స్లాంగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా విజయంలో అది ఒక భాగమైందనే చెప్పుకోవచ్చు.

సందీప్ 1988, డిసెంబర్ 25న వరంగల్‌లో జన్మించాడు. వరంగల్‌లోని ప్లాటినం జూబ్లీ హైస్కూల్‌లో  8వ తరగతి వరకు చదువుకున్నాడు. అఘాఖాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్లో 9వ తరగతి చదువుకున్నాడు. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హైదరాబాదులో చదివాడు. దార్వాడలోని ఎస్.డి.ఎం. వైద్య కళాశాలలో ఫిజియోథెరఫీ పూర్తిచేసి, కొన్నాళ్లు వైజాగ్‌లో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత సినిమారంగం మీద ఉన్న ఆసక్తితో ఆస్ట్రేలియా, సిడ్నీలోని అకాడమీ అఫ్ ఫిలిం, థియేటర్ అండ్ టెలివిజన్‌లో ఫిలిం మేకింగ్‌పై శిక్షణ తీసుకున్నాడు.

వేణు ఊడుగుల :ఈ ఏడాది ‘ నీదీ నాదీ ఒకే కథ ’ అనే సినిమాతో తెలుగు తెరకు బోణీ ఇచ్చిన దర్శకుడు వేణు ఊడుగుల. సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుణ్ణి ‘ అరె ఇది మన కథే కదా ’ అన్నంతగా కథలోకి కనెక్ట్ చేశాడు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, ఇంటర్వెల్ బ్యాంగుల జోలికి వెళ్ళకుండా, ఐటెం సాంగులంటూ నానా రభస చేయకుండా సింపుల్‌గా ఒక కథ చెప్పాడు. ఆ కథ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.. ఆకట్టుకుంటోంది.. వెటాడుతోంది.. ఏ థియేటర్‌ను చూసినా హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. స్వతహాగా కవి అవటం వల్ల సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌లో కవిత్వం ఉట్టిపడేలా తీశాడు దర్శకుడు. వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో జన్మించాడు వేణు ఊడుగుల. మూడో తరగతి వరకు ఉప్పరపల్లిలో చదివుకున్న వేణు, తర్వాత హన్మకొండలోని బాలసముద్రంలో చదివాడు. డిగ్రీ చివరి సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చాడు.

కండక్టర్ కాస్తా హీరో అయిన రజినీకాంత్‌లా.. వేణు ఊడుగుల కూడా కండక్టర్ అయితే చాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎందరో మెచ్చిన దర్శకుడు అయ్యాడు. చిన్నప్పటినుండి సినిమాలపై ఆసక్తి ఉండటంతో, 2008లో సినిమారంగానికి వచ్చాడు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో కొంతకాలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేసి, ఆ తరువాత మదన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. ఎలాగైనా ఓ మంచి సినిమా తీసి దర్శకుడిగా తన సత్తా చాటాలనుకొని ‘ నీదీ నాదీ ఒకే కథ ’ తో వచ్చి ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ వరంగల్ బిడ్డ. మొత్తానికి తెలంగాణ బిడ్డ.

ఇదీ ఈ ముగ్గురి కథ. ఇదీ వరంగల్ బిడ్డలు దర్శకులుగా తెలంగాణ ఖ్యాతికి వన్నె తెచ్చిన వివరం. ముందు ముందు కూడా ఇంకా చాలా మంది వీళ్ళలా సినిమా రంగంలో దర్శకులుగా రాణిస్తారని కోరుకుందాం.