అవి ప్రమాదం.. అందుకే క్యాట్‌ఫిష్ చేపలను తగలబెట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

అవి ప్రమాదం.. అందుకే క్యాట్‌ఫిష్ చేపలను తగలబెట్టారు

March 21, 2018

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్‌ను కొందరు దొంగచాటుగా చెరువుల్లో పెంచి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని అయ్యలూరు గ్రామం వద్ద నిషేధింపబడ్డ ప్రమాదకర క్యాట్‌ఫిష్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు చెరువు వద్ద మంగళవారం రాత్రి వాటిని చెరువులో వేస్తుండగా సమాచారం తెలిసిన అధికారులు, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో గ్రామ శివార్లలో వాటిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అయినా కొంతమంది వ్యాపారమే పరమావధిగా క్యాట్‌ఫిష్‌ను పెంచుతున్నారు. వాటికి చికెన్‌ వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారు. ఈ విషయం తెలిసి గతంలో అధికారులు చేపల చెరువులపై దాడులు చేశారు. దీంతో చేపల పెంపకం దారులు సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. క్యాట్‌ఫిష్‌ నిషేధానికి గురవడంతో.. ఫంగస్‌ అనే మరో రకమైన చేపల పెంపకానికి తెరలేపారు. ఇలాంటి చేపల పెంపకానికి ఎలాంటి అనుమతులు లేకున్నా.. అనుమతులు ఉన్నాయని చెబుతూ.. ఫంగస్‌‌ఫిష్‌ చేపలకు చికెన్‌ వ్యర్థాలను వాడుతున్నారు. ఈ మాంసం వ్యర్థాలను చేపలకు వేయడం వల్ల.. అవి విషపూరితంగా మారతాయని, వాటిని తినే మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.