దేశం అసలే నిరుద్యోగ సమస్యతో అతలాకుతలం అవుతోంది. చిన్నపాటి ఉద్యోగాలకు కూడా లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో బంపర్ ఆఫర్ వెలువడింది. నెలకు రూ.15 వేల జీతం.. అర్హతలు ఏమీ లేవు. చదువుచట్టుబండలు అసలు అక్కర్లేదు. ఇక పని విషయంలోకి వస్తే.. పెద్దగా పనేం ఉండదు. జస్ట్.. రోజుకో నేరం చేసి, రిజల్ట్ అందిస్తే చాలు. చిన్న షరతు కూడా ఉంది. నేరం చేయకపోతే జీతంలో కోత పడుతుంది. చిత్రమైన ఉద్యోగం కదూ!
ఈ ఉద్యోగాలిస్తోంది. ఆశిష్ మీనా అనే 21 ఏళ్ల కుర్ర చోరప్రబుద్ధుడు. అతగాడు ప్రజాసేవలో భాగంగా నిరుద్యోగ యువత కోసం ఇటీవల ఆఫీసు తెరిచాడు. దొంగలకు ఉద్యోగమిస్తానని ప్రకటించారు. బంగారు నగలు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాల కొట్టేయాలంటూ ఆరుగురిని ఉద్యోగులుగా నియమించుకున్నాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిందీ ఘటన. కొన్నాళ్ళ వరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాయి వీరి కార్యాలయం పనులు. కానీ ఏదీ ఎక్కువ రోజులు దాగదు కదా. పైగా ఇలాంటి తతంగం పోలీసులకు అట్టే తెలిసిపోయింది.
ఎలా పట్టుకున్నారు…?
కొన్నాళ్లుగా జవహర్ సర్కిల్ ఏరియా, శివ్‌దాస్‌పుర, ఖో నగోరియాన్, సంగనీర్ సహా ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. చైన్ స్నాచింగ్‌లు, మొబైల్ ఫోన్ దొంగతనాలు, మోటార్ సైకిళ్ల మాయమవడంపై స్థానికుల నుంచి తరచూ ఫిర్యాదులు అందుతుండటంతో పోలీసులు నిఘా వేశారు. నిందుతులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ల్యాప్‌టాప్, 35 పోన్లు, మోటార్ సైకిళ్లు, రెండు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉద్యోగంలో చేరినవారు దొంగతనాలు చేసి క్రైమ్ ఆఫీస్ అధికారి అయిన ఆశిష్‌కు ఇస్తే అతగాడు వాటినితెగనమ్ముకుని ఉద్యోగులకు జీతాలిస్తున్నాడని, మిగిలిన సొమ్మును తను తీసుకుంటున్నాడని దర్యాప్తులో తేలింది. ఈ దొంగ ఉద్యోగులందరూ నిరక్షరాస్యులని, ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్న వారేనని పోలీసులు వివరించారు. వారందరికి ఉద్యోగాలిచ్చి వారందరిని ఓ ఇంట్లో పెట్టినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 36 నేరాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.