హైదరాబాద్‌లో దొంగల బడి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో దొంగల బడి

December 5, 2017

వారికి దొందతనం చేయటం చిటికెలో పని. చైన్ స్నాచింగ్‌లు, జేబు కటింగులు, బస్సుల్లో సెల్‌ఫోన్లు మాయం చేయటం వెన్నతో పెట్టిన విద్య.  కొన్నేళ్ళ క్రితం మహారాష్ట్ర, కర్నాటకల నుంచి వచ్చి ఈ బస్తీలో స్ధిరపడిన వారిలో అత్యధికులు నేరప్రవృత్తినే ఎంచుకున్నారు. హైదరాబాద్‌ మల్లేపల్లిలోని మన్గార్ బస్తీ అంటే అక్కడి స్థానికులను అడిగితే చాలామంది వారి బారిన పడ్డ బాధితులే కనిపిస్తారు.  

‘ నేనలా పూజకని గుడికి వెళ్తున్నాను. అంతే వెనకనుండి ఇద్దరు వచ్చి నా మెడలో వున్న మూడు తులాల బంగారు నెక్లెస్‌ను తెంచుకెళ్లారు. హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వాళ్ళేం చెయ్యలేకపోయారు ’ అని చాలా మంది మన్గార్ల గురించి కోకొల్లల కథలు చెప్తారు. ఒకానొక సందర్భంలో పోలీసులు కూడా వారిని ఏమీ చెయ్యలేని పరిస్థితి. సొమ్ములు పోగొట్టుకొని వారిని ఏమీ అనలేక మిన్నకుండిపోయినవారు మనకు చాలామంది అక్కడ కనిపిస్తారు.  

దొంగతనమే వారి వృత్తి :

అందరిలా వాళ్ళు పనీపాట చేసుకుని బతకరు. దొంగతనమే వృత్తిగా ఎంచుకుంటారు. దొంగతనంలో ప్రావీణ్యం చూపినవారినే వాళ్లు తమవాళ్ళుగా గుర్తిస్తారు. చూడ్డానికి వారు పెద్ద పెద్ద బాడీబిల్డర్ల మాదిరి వుండరు. బక్క పలుచగా వుంటారు.. పట్టుకునేలోపే చేపల్లా జారిపోతారు. మల్లేపల్లి పెద్ద మసీదు దగ్గర నుండి సీతారాంబాగ్ వెళ్ళే రూటుకు మధ్యలో మాన్గార్ బస్తీ వుంటుంది. పెద్ద పెద్ద కరడు గట్టిన రౌడీ షీటర్లు కూడా వారి జోలికి వెళ్ళడానికి జంకుతారు. నాంపల్లి, బజార్ ఘాట్, మల్లేపల్లి, సీతారాంబాగ్, మెహిదీపట్నం,  ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీ, జిర్రా, బేగం బజార్ మొదలైన ఏరియాల్లో వాళ్ళు ఎక్కువగా గస్తీ కాస్తుంటారు. బస్సుల్లో, థియేటర్లలో కూడా దోచుకొని మెరుపు వేగంగా జారుకుంటారు.  బస్సుల్లో, రైళ్లలో, ర్యాలీలు, పాదయాత్రలలో జట్లు జట్లుగా దొంగతనాలకు తెగబడుతుంటారు.

సరదాగా సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్ళనప్పుడు వారు ఓ నలుగురైదుగురు రౌండప్ చేసి నానా హడావిడి చేసి కన్ఫూజ్ చేసి ఫోన్లు, పర్సులు లాక్కెళ్తారు. ఎవరైనా వారిని పట్టుకుంటే జేబులో వున్న కత్తి, బ్లేడుతో దాడి చేసి పారిపోతారు. ఆ ఏరియాల్లో తిరిగే సిటీ బస్సుల్లో వీరు కచ్చితంగా పిక్ పాకెటింగ్‌కి పాల్పడతారు. వీరిలో చాలా మంది ఇద్దరు ముగ్గురు భార్యలను పెళ్ళి చేసుకుంటారు. పిల్లలను కనటంలో అడ్డూ అదుపు లేకుండా వుంటారు. వీళ్ళ ఆడవాళ్ళు చెత్త ఏరుతుంటారు.  

దొంగల బడులు :

తమ వారసులకు వాళ్ళు చోరకళనే బహుమతిగా ఇస్తారు.  రెండు శతాబ్దాల క్రితం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 500 కుటుంబాలు హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాన్గార్‌ బస్తీలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి.  ఇక్కడి పిల్లలు చదువుకునేందుకు ఇష్టపడరు. పెద్దలు సైతం వీరిని బడికి పంపించరు.  కానీ దొంగతనాలు నేర్పే బడికి మాత్రం పంపిస్తారు. బస్తీలో పదుల సంఖ్యలో ఈ  పాఠశాలలున్నాయి. ఇక్కడ చోరకళ మాత్రమే నేర్పిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల మెడలోని గొలుసు ఎలా తెంచుకోవాలి ? జేబులు కత్తిరించి, ఎలా బయటపడాలో ప్రాక్టీస్‌ చేయిస్తారు. పదేళ్లు నిండాయంటే చాలు బాలుడ్ని దొంగతనానికి మార్కెట్లోకి పంపిస్తారు.

వీరి ముఠా నాయకుడు చాలా క్రూరంగా వ్యవహరిస్తాడు.  దొంగలించిన సొమ్మంతా ముఠా నాయకుడికి అందజెయ్యాలనే రూలును చాలా కఠినంగా అవలంభిస్తాడు.. ఈ క్రమంలో దొంగ పోలీసులకు చిక్కితే విడిపించడానికి అవసరమయ్యే ఖర్చు, తల్లిదండ్రుల పోషణ, వైద్య ఖర్చులు అన్నీ ముఠా నాయకుడే చెల్లిస్తాడు. చెల్లించిన పైకానికి  30 శాతం వడ్డీ వసూలు చేస్తాడు. అసలు, వడ్డీ చెల్లించకుంటే పిల్లలు వారి అధీనంలోనే ఉండాలంటాడు. ఇలా తీసుకున్న డబ్బు చెల్లించలేక, ఇచ్చిన మాటను కాదనలేక, ఎదురించినా బస్తీలో ఇమడలేక ఎంతో మంది తమ కుటుంబాలను చేతులారా నిర్వీర్యం చేసుకుంటున్నారు.  

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మార్పు :

పోలీసులు మన్గార్ బస్తీ వాసుల్లో మార్పు తేవడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తూ వారిలో మార్పుకు కృషి చేస్తున్నారు. తరతరాలుగా వదలని మత్తును వారినుండి వదిలించటానికి ప్రయత్నిస్తున్నారు. నేరాలను అదుపు చేయడానికి రెండేళ్ల క్రితం ఈ బస్తీ నుంచే పోలీసులు కట్టడి ముట్టడి ( కార్డన్‌ సెర్చ్‌ ) కి శ్రీకారం చుట్టారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో 70 శాతం చైన్‌ స్నాచింగ్‌  కేసులు తగ్గాయి.  పోలీసుల వరుస దాడులు, కేసుల నమోదు, పీడీ యాక్టులతో సగం మంది నేరాలు మానేసి, ఉపాధి పనుల బాట పట్టారు. బస్తీ ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు నిరంతరం  తపిస్తున్నారు. ఇందులో భాగంగానే మాన్గార్‌ బస్తీలో లయన్స్‌ క్లబ్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సామూహిక అన్నదానాలు, దుస్తుల పంపిణీ, అవగాహన సదస్సులు, హెల్త్‌ క్యాంపులు, ఉద్యోగ మేళాలు  చేపడుతున్నారు.  ఈ క్రమంలో వివిధ నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న 25 మంది సభ్యులను సన్మార్గంలోకి తీసుకురావాలని నిర్ణయించు కున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాలు అవలంభిస్తూ వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తూ తమపై నమ్మకం పెంచుకున్నారు. ప్రవృత్తిని మార్చుకుంటే భవిష్యత్తులోనూ పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బం దులు ఉండవంటూ భరోసా ఇచ్చారు. ఫలితంగా ఆ 25 మందీ సోమవారం డీసీపీ ఎదుట లొంగిపోయారు.

మాన్గార్‌బస్తీ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నేరాలు చేస్తున్న ఎనిమిది ప్రధాన గ్యాంగులను గుర్తించిన పోలీసులు వాటినే ‘టార్గెట్‌’గా చేసుకున్నారు. వీరు ఇప్పటికే సిటీలోని 32 ఠాణాల పరిధిలో నమోదైన 200 కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్ళివ చ్చారు. వివిధ పోలీసుస్టేషన్లలో 106 నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 194 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలోనే కేసులు ఉన్నాయి. వీటిలో  జేబు దొంగతనాల నుంచి దోపిడీల వరకు వివిధ నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రస్తుతం వీరందరినీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను పరిష్కరించడంతో పాటు సొత్తు రికవరీ చేసి బాధితులకు అందించనున్నారు. వీరికి ఉద్యోగాలతో పాటు జీవనోపాధి కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ విధానాన్ని కొనసాగిస్తూ మిగిలిన నేరగాళ్ళు సైతం  మారేందుకు ఆస్కారం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం మావోయిస్టుల విషయంలో మాత్రమే అనుసరించే సరెండర్‌ పాలసీని మాన్గార్‌బస్తీ నేరగాళ్ళకూ వర్తించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘తరతరాలుగా దొంగతనాలు చేస్తూ జీవితాలను నాశనం చేస్తూ ఫైనాన్సియర్లను బతికిస్తున్నారు. తాతముత్తాతల వృత్తినే మళ్లీ ఎంచుకుని జీవించడం సరికాదు. నేర ప్రవృత్తిని  వీడనాడాలి. పిల్లలను బాగా చదివించుకోవాలని బస్తీవాసులను కోరుతున్నాం’ అని డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపారు.