ఈ ఐదేళ్ల బాలుడు నీటి పారుదలశాఖ బ్రాండ్ అంబాసిడర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఐదేళ్ల బాలుడు నీటి పారుదలశాఖ బ్రాండ్ అంబాసిడర్

February 5, 2018

నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావును అబ్బుర పరిచాడో బాలుడు. రాష్ట్ర నీటి పారుదలపై మంత్రి చేస్తున్న కృషిని ఆ బాలుడు గుర్తించాడు. 20 నిమిషాల పాటు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై నేహాల్ అనే ఈ ఐదేండ్ల బాలుడు అనర్గళంగా మాట్లాడి మంత్రిని మంత్రముగ్దుణ్ణి చేశాడు. ఆదివారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో మంత్రి హరీశ్‌రావు, తెలంగాణ పబ్లిక్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి సమక్షంలో నేహాల్ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది.  వెంటనే నేహాల్‌ను నీటి పారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు.  కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ పాయింట్‌కు మార్చ డం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా పలు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ఖమ్మం జిల్లాకు చెందిన యూకేజీ చదువుతున్న నేహాల్ ప్రసంగించి అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే నీటి పారుదల గురించి ఇంత పట్టు వుండటంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నేహాల్‌ ఉన్నత స్థాయికి ఎదుగుతాడని పలువురు వ్యాఖ్యానించారు.ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లకు చెందిన హనుమంతరావు కుమారుడు నేహాల్ షాపూర్‌నగర్‌లోని ఓ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఈ సందర్భంగా నేహాల్ చదువు బాధ్యత నీటి పారుదల శాఖ భరిస్తుందని హామీ ఇచ్చారు హరీష్ రావు. సీఎం కేసీఆర్‌‌ను కలవాలనుందన్న నేహాల్‌ను తొందరలోనే తీసుకెళ్తానని చెప్పారు. నేహాల్‌కు ప్రాజెక్టులపై మరింత అవగాహన కోసం అతనితో పాటు అతడి కుటుంబసభ్యులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకువెళ్లాలని సీఈ హరిరామ్‌కు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలిచ్చారు. అనంతరం నేహాల్‌ను అందరూ అభినందనలతో ముంచెత్తారు.