ముంపుకు గురయ్యే ఇళ్ళకు ఇదే చక్కని పరిష్కారం - MicTv.in - Telugu News
mictv telugu

ముంపుకు గురయ్యే ఇళ్ళకు ఇదే చక్కని పరిష్కారం

March 21, 2018

హైదరాబాదులో ఇల్లున్నవాడు పల్లెటూళ్ళో ఒక ఎకరం పొలం వున్న ఆసామితో సమానం అంటారు. బ్యాంక్ లోన్లో, అప్పులో సప్పులో చేసి నగరంలో సొంతింటి కలను నిజం చేసుకుంటున్నవాళ్ళు చాలామంది వున్నారు. అలా కట్టుకున్న ఇల్లుకు వరద సమస్య వస్తే తీసుకెళ్ళి వేరేచోట పెట్టుకోలేం. ఇల్లు పీకి కొత్తిల్లు కట్టడం సాధ్యం కాదు. పదేళ్ళ కింద ఇల్లు కట్టినప్పుడు పరిస్థితులు బాగానే వుంటాయి. తర్వాత సీసీరోడ్ల ఎత్తులు పెరుగుతూ రావటంతో ఇల్లు క్రిందికి అవుతుంటుంది. తద్వార వర్షాలు పడినప్పుడు వరదనీరు ఇంట్లోకి వచ్చి చేరుతుంది. ఇంటికి సెల్లార్ గనక వుంటే అదొక చిన్నపాటి చెరువులా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యజమాని ఆ ఇంటిని కూల్చి వేరే ఇల్లు కట్టడం సాధ్యమయ్యే పని కాదు. కానీ దానికి ఒక పరిష్కార మార్గం వుంది. అదే జాక్‌ల ద్వారా ఇంటిని పైకి లేపటం. ఈ చర్య నిష్ణాతులైన ఇంజనీర్ల సమక్షంలో జరగాల్సి వుంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఇల్లు కుప్పకూలే పరిస్థితులున్నాయి. దేశ వ్యాప్తంగా ఇలా ఇళ్ళను పైకి లేపటం చాలా చోట్ల జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇదే తొలిసారి అనొచ్చు.

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్ పరిధిలోని సారధి స్టూడియో వెనకాల జరిగింది ఈ ఘటన. హైదరాబాద్‌లోని జెజె ఇంజనీరింగ్ వర్క్స్‌ ఇంజనీర్లు ఈ పనికి పూనుకున్నారు. వర్షాకాలం వస్తే ఆ ఇంటికి వరదముప్పు వుందని యజమాని ఈపని చేయించాడు.  చాలా జాగ్రత్తగా దాదాపు మూడున్నర అడుగుల ఎత్తుకు ఎత్తే ప్రాసెస్ మొదలైంది. ఇందుకుగాను 20 రోజుల వ్యవధి పడుతుంది అంటున్నారు ఇంజనీర్లు. ఈరోజు ఒకటిన్నర అడుగుల ఎత్తు వరకు ఎత్తారు. తక్కువ ఖర్చులో సమస్య పరిష్కారం అవటంతో ఇంటి యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. వరదముప్పు వున్న ఇళ్ళకు ఇది చక్కని పరిష్కారం అంటున్నారు ఇంజనీర్లు.