గొప్ప ఫ్లాప్ సినిమా.. - MicTv.in - Telugu News
mictv telugu

గొప్ప ఫ్లాప్ సినిమా..

October 25, 2017

హాలీవుడ్‌లో వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో చాలా గొప్ప అంచనాలు వుంటాయి. కానీ ఈ ఏడాది  ఒక ఘోరాతిఘోరమైన అపజయాన్ని మూట గట్టుకున్నది ఆ సంస్థ. ఓ సినిమా నిర్మాణంలో ఇతర నిర్మాతలతో పాలు పంచుకుని భారీ నష్టాన్ని చవిచూసింది.  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థే విడుదల చేయటం విశేషం. డేవిడ్‌ ఎల్లిసన్‌ ఈ సినిమా నిర్మాత అయినప్పటికీ స్కైడాన్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థలు కూడా ఇందులో పాలు పంచుకున్నాయి. ఏకంగా 650 కోట్ల రూపాయలు నష్టపోయిందని అంచనా. రూ. 779 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత ఘోరంగా బోల్తాపడిందంటే.. కొన్ని సినిమా పత్రికలు దీనికి 0.5 రేటింగ్ ఇచ్చేంతగా..

‘జియో స్మార్ట్’ అనే ఈ సినిమా భారీ ఫ్లాప్ సినిమాగా ఈ ఏడాది నిర్మాతల ఖజానాకు పెద్ద గండి కొట్టింది. డీన్ డెవ్లిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జిగార్ట్‌ బట్లర్‌, జిమ్‌ స్టర్గేస్‌, అబ్బీ కోర్నిష్‌, అలెగ్జాండ్రా, లారా, రిచర్డ్‌ షిప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబరు 20, 2017న విడుదలైంది. ఘోర పరాజయం పాలవడంతో నిర్మాతలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

ఈ సినిమా కథా కమామీషు ఏంటంటే.. వాతావరణాన్ని నియంత్రించే శాటిలైట్లలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా అవి విఫలమై ప్రకృతిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి. గతి తప్పిన శాటిలైట్ల నుంచి ఓ శాటిలైట్‌ డిజైనర్‌ ప్రపంచాన్ని ఎలా రక్షించాడు? అనేదే ఈ చిత్ర కథ.  2డీ, 3డీ, ఐమాక్స్‌ 3డీ ఫార్మాట్‌లలో ఈ సినిమా నిర్మాణం జరుపుకున్నది. 2014 లో చిత్రీకరణను మొదలు పెట్టి 2016 లో ముగించారు. రీషూట్లు కూడా చేయాల్సి వచ్చిందట. గ్రాఫిక్ బాగున్నా సినిమాలో విషయం లేదని సినీ విశ్లేషకులు తేల్చి చెప్పేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా 66 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది.