పిల్లల బుగ్గలు గిల్లడానికి కారణం తెలిసింది..

ముద్దులొలికే చిన్న పిల్లలను చూడగానే పెద్దలు ముద్దుగా వాళ్ల బుగ్గలను గిల్లేస్తారు, ముద్దులు పెడతారు. ముద్దుగా ఉండే కుక్కపిల్లలు కనిపిస్తే కూడా ఇంకొందరు తమ ఆనందాన్ని ఆపుకోలేరు…వెళ్లి వాటిని చేతుల్లోకి తీసుకుంటారు. ఇలాంటి ప్రవర్తనకు  కారణాలు మనుషుల మెదడులోని ‘రివార్డ్‌ సిస్టమ్‌’ ప్రాంతంలో కలిగే స్పందనలని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

rrr

బుగ్గలు గిల్లడం, ఎత్తుకోవడం వంటి వాటిపై యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్‌ కేథరిన్‌ పరిశోధన నిర్వహించింది. కేథరిన్ మాట్లాడుతూ… ‘ముద్దులొలికే చిన్నారులు, కుక్కపిల్లలు వంటి వాటిని చూసినప్పుడు మెదడులో కలిగే ఎలక్ట్రికల్‌ స్పందనల నమోదుకు ఎలక్ట్రోఫిజియాలజీ అనే పద్ధతిని ఉపయోగించాం. పరిశోధనలో భాగంగా 18–40 సంవత్సరాల వయస్సు ఉన్న 54 మందికి తలలకు ఎలక్ట్రోడ్స్‌ అమర్చి వేర్వేరు ఫోటోలను చూపించాం. మిగతా ఫొటోలతో పోల్చుకుంటే చిన్నారులు, కుక్క పిల్లల చిత్రాలను చూసినప్పుడు వీరి మెదడులోని రివార్డ్‌ సిస్టమ్‌ ప్రాంతంలో ఉద్దీపనల తీవ్రత ఎక్కువగా ఉంది. దీనివల్లే చిన్నారులను చూసినప్పుడు వెంటనే వారి బుగ్గలను గిల్లాలని అనిపిస్తుంది’ అని వెల్లడించారు. ఈ పరిశోధన ‘ఫ్రాంటియర్స్‌ ఇన్‌ బిహేవియరల్‌ న్యూరోసైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.