ఈ నెల్లూరు  ‘ స్వాతి ’ కథ అడ్డం తిరిగింది... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ నెల్లూరు  ‘ స్వాతి ’ కథ అడ్డం తిరిగింది…

December 16, 2017

కలకాలం కలిసి జీవితాన్ని పంచుకుంటామని అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకున్న వారు ఎందుకు ఒకరినొకరు చంపుకోవాలనుకుంటున్నారు ? అక్రమ సంబంధాలు, ఆస్తి తగాదాలతో కట్టుకున్న వారిని కడతేర్చటమే కరెక్టనని ఎందుకనుకుంటున్నారు ? ఆ కోవలో భర్తను చంపిన మరో స్వాతిగా మారకముందే ఈమె కథ అడ్డం తిరిగింది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరుకు  చెందిన లింగం మాల్యాద్రి.. సాయి ప్రీతికి రెండవ భర్త. వారిద్దరి మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయి. దీంతో నాలుగేళ్ళుగా వేరుగా వుంటున్నారు.

భర్తను హతమార్చి ఆస్తి మొత్తం తన సొంతం చేసుకుందామనుకున్నది ప్రీతి. ఈ క్రమంలో వారి వద్ద డ్రైవర్‌గా పని చేసిన రాజేష్, కావలి సబ్ జైలులో గార్డుగా పని చేస్తున్న రవితో కలిసి పన్నాగం పన్నింది.

ఈ పన్నాగంలో భాగంగా కావలికి చెందిన ఒక పాత నేరస్థుడితో కలిసి మాల్యాద్రిని చంపేందుకు రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని  అందులో కొంత డబ్బు అడ్వాన్స్‌గా కూడా ఇచ్చింది. అయితే మాల్యాద్రిని చంపడానికి భయపడ్డ ఆ పాత నేరస్థుడు నేరుగా తమ ప్లాన్ మొత్తం మాల్యాద్రికే పూసగుచ్చినట్లు చెప్పేశాడు. దీంతో మాల్యాద్రి కావలి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు సెల్‌ఫోన్‌ కాల్‌ రికార్డుల ఆధారంగా హత్య చేసేందుకు పథకం నిజమేనని నిర్ధారణకు వచ్చారు. అనంతరం శుక్రవారం కారు డ్రైవరు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ కేసులో పట్టణంలో మరో ప్రచారం జరుగుతోంది. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలే మాల్యాద్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నుండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసేందుకు సుపారి తీసుకున్న స్థానిక నేరస్థుడు వేరొక ముఠాతో హత్యకు పథకం వేయగా అదికాస్తా విఫలం కావడంతో వెనుతిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు ఈ హత్యకు కుట్ర పన్నిన నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు.