యంత్ర చేయి… ఎంత నవ్వితే అన్ని గోరుముద్దలు తినిపిస్తుంది…

మొహం మీద నవ్వు వుంటే ఎదుటివాళ్ళు మనతో చాలా చక్కగా కలిసిపోతారు. అందుకే స్నేహితులను ఎక్కువగా సంపాదించుకోవాలంటే ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు వుండాలంటారు. ఈ రోబోటిక్ చేయి(ఫీడింగ్ ఆర్మ్) కూడా అంతే. ఎవరైతే మనస్ఫూర్తిగా నవ్వుతారో వాళ్ల బొజ్జ నింపుతానంటోంది. నవ్వుతో తిండికి లంకె పెట్టిన ఆ తిరకాసేంటో తెలుసుకుందాం. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ల్యాబ్ తయారు చేశారు రోబోటిక్‌ చేయిని(ఫీడింగ్ ఆర్మ్). ఇది నవ్వినవాళ్ళను నావాళ్లు అనుకుంటుంది. నవ్వనివాళ్లకు ఒక్క ముద్దేం ఖర్మ మెతుకు కూడా పెట్టదు. టెన్షన్లన్నీ మరిచి ఎంచక్కా సంతోషంగా తినండని చెప్పకనే చెప్పే రోబోటిక్ చేయి మాట ఇది.దీన్ని ఎలా వినియోగించాలంటే…

వినియోగదారులు ఈ యంత్ర చేయిని ఛాతి వద్ద ధరించాలి. అది ఏ యాంగిల్‌లో అయినా భోజనం తినిపిస్తుంది. ఎదురెదురుగా కూర్చున్న ఇద్దరు వ్యక్తుల మధ్య దాన్ని వాడుతారు. అది ఫిక్సయ్యాక దాని పనితీరు వారివారి ముఖ కవళికలను బట్టే మొదలవుతుంది. ఎంత ఆకలిగా వున్నా చిన్న స్మైల్ ఇవ్వంది అది ముద్ద పెట్టదు. ఆ చేత్తో తినాలనుకున్నవారు తప్పకుండా నవ్వి తీరాల్సిందేనని ఆ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. వారు షేర్ చేసిన ఆ ఫీడింగ్ ఆర్మ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..

‘మీరు ఎంత నవ్వితే అంతగా తినిపిస్తుంది. తప్పకుండా ఈ ఫీడింగ్ ఆర్మ్‌తో ప్రేమలో పడతారు’ అని ఆ విశ్వవిద్యాలయ పరిశోధకులు ట్వీట్ చేశారు. రోబోటిక్ చేత్తో ముద్దలు తిన్నవారు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ చేత్తో తింటే చిన్నప్పుడు అమ్మ చేత్తో తిన్న గోరుముద్దలు గుర్తొచ్చాయని వినియోగదారులు తమ ఫీలింగ్స్ పంచుకుంటున్నారు. పరిశోధకులకు కూడా చేయి పనితీరు మంచి ఫలితాన్నే ఇచ్చింది.