ఎలుకల ధాటికి కూలిపోయిన భవనం - MicTv.in - Telugu News
mictv telugu

ఎలుకల ధాటికి కూలిపోయిన భవనం

April 16, 2018

బట్టలు కొరకటం, వస్తువులను నాశనం చేయటం వరకే ఎలుకల చర్యలను చూశాం. కానీ ఎలుకలన్నీ కలిసి ఓ భవనాన్ని కూల్చాయంటే నమ్మగలమా ? నమ్మాల్సిందే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ భవనం ఎలుకల దెబ్బకు కుప్పకూలింది. వాటిని నివారించటానికి యజమాని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతని వ్యూహాలు ఫలించలేవు. మురుగు కాల్వల పైపుల్లోకి జొరబడి వాటిని పాడుచేయడం, ఇంటి పునాదుల్లోకి కలుగులు చేసుకుని అందులో నివసిస్తూ ఆ ప్రాంత వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో భవనం కింద నివాసం ఏర్పరచుకున్న వేలాది ఎలుకలు పెద్ద ఎత్తున రంధ్రాలు చేశాయి.

మంకమేశ్వర్ ఆలయ సమీపంలోని మూడంతస్తుల భవనం అది.  యజమాని సుధీర్ కుమార్ వర్మతో కలిసి ఓ ఎనిమిది కుటంబాలు ఆ భవనంలో అద్దెకు వుంటున్నారు. చాలా రోజులుగా ఆ భవంతిలో ఎలుకల బెడద వుంది. వాటిని నివారణకు యజమాని అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అవి నిర్మూలన కాలేవు. బంగళా అండర్‌గ్రౌండ్‌లో అవి కలుగుల్లో ఆవాసాలు ఏర్పరుచుకున్నాయి. వేలల్లో ఎలుకలు నిత్యం మట్టి తవ్వతూ కింద భూమినంతా జల్లెడ మాదిరి చేశాయి. ఫలితంగా పునాదులు బలహీన పడ్డాయి. చుట్టు పక్కల వాళ్ళు చెప్పటంతో ఇంటి యజమాని ప్రమాదాన్ని ముందుగానే ఊహించాడు. ఈ మధ్య వర్షాలు కురవటంతో కలుగుల్లోకి భారీగా వరదనీరు చేరింది. ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన యజమాని వెంటనే అందర్నీ బిల్డింగ్‌లోంచి ఖాళీ చేయించాడు.  

ఆ తర్వాత కొన్ని గంటలకే భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దృశ్యాన్ని అక్కడి సీసీ టీవీ కెమెరాలు రికార్డు చేశాయి. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భవనం కూలినవైపు నివాసాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పీపల్ మండీ కౌన్సిలర్ రవి మాథుర్ తెలిపారు. బిల్డింగ్ కూలినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీవాళ్ళు స్పందించి ఎలుకల మీద తగు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.