ఓదెలు కుమారుడి బెదిరింపులు.. దంపతుల ఆత్మహత్యా యత్నం - MicTv.in - Telugu News
mictv telugu

ఓదెలు కుమారుడి బెదిరింపులు.. దంపతుల ఆత్మహత్యా యత్నం

April 3, 2018

అధికార పార్టీ అండదండలు చూసుకొని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కుటుంబ సభ్యులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని.. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు దిగటంతో ఓ కుటుంబం రైలు పట్టాలపై ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటన మంచిర్యాలలో జరిగింది. స్థానిక హైటెక్ సిటీ ప్రాంతంలో రైలు పట్టాలపై తమ కుమారుడితో కలిసి అరవింద్, సువర్ణ దంపతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వారిని కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల వివరాల ప్రకారం.. 2016 లో అరవింద్, సువర్ణలకు చెందిన స్వర్ణమయి వస్త్ర దుకాణంలో భాగస్వామిగా చేరడం కోసం విప్ ఓదెలు కుమారుడు క్రాంతి రూ. 1.10 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అరవింద్ తండ్రి సాంబయ్య, ఓదెల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. అలాగే ఓదెలు సాంబయ్యకు బోర్‌వెల్‌కు సంబంధించి రూ. 2 కోట్లు ఇవ్వాలి.అయితే 2017లో సాంబయ్య చనిపోయాడు. అప్పటినుంచి వారు ప్లేట్ ఫిరాయించారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని అరవింద్ అడగ్గా.. ఓదెల కుమారుడు క్రాంతి డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరింపులకు దిగడం మొదలు పెట్టాడు. ఓదెల ఆధ్వర్యంలో రెండు, మూడు సార్లు చర్చలు జరిపినప్పటికీ ఇస్తామని చెప్పి మాట దాటవేస్తున్నారని చెప్పారు. తను బెదిరించడమే కాకుండా జైపూరుకు చెందిన తెరాస నాయకుడు మధూకర్ రెడ్డితో కూడా బెదిరిస్తున్నారని తెలిపారు. దుకాణంలో వున్న వస్తువులు సైతం అమ్మేస్తున్నట్టు వాపోయారు. రోజురోజుకు ఓదెల కుమారుడి నుండి బెదిరింపుల ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సరైన ఆధారాలు వుంటే ఓదెల కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామని సీఐ మహేష్ తెలిపారు. ఇదిలా వుండగా తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే వారిలా చేస్తున్నారని అన్నారు. ఈనెల 10 వరకు రూ. 30 లక్షలు చెల్లించటానికి ఒప్పుకున్నట్టు ఓదెలు పేర్కొన్నారు.