ప్రకాశ్‌‌రాజ్‌కు బెదిరింపులు.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రకాశ్‌‌రాజ్‌కు బెదిరింపులు..

March 14, 2018

మంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరించటానికి ప్రయత్నించారని నటుడు ప్రకాశ్‌రాజ్ చెప్పారు. రాజకీయ నాయకుల వైఖరి బాగాలేదని ఒక ప్రజాస్వామ్యవాదిగా తాను వాళ్ళను విమర్శించటం తప్పెలా అవుతుందని అన్నారు. విమర్శించినవారినల్లా ఇలా టార్గెట్ చేయటం ఎంతవరకు సరైందని మండిపడ్డారు. బుధవారం ఆయన మంగళూరులో మీడియాతో మాట్లాడారు.

వారు నేరుగా నన్ను బెదిరించటానికే వచ్చారు. నాకు భద్రతగా వచ్చిన పోలీసులు అక్కడ వుండటంతో వాళ్ళు నా డ్రైవర్ దగ్గరకు వెళ్లారు. అతని పేరు, వివరాలు, నేను రాత్రి ఎక్కడ బసచేస్తాను వంటి వివరాలు అడిగారు. జాగ్రత్తగా వుండాలని బెదిరించి అక్కడినుండి పారిపోయారు. సమయానికి నాతో పోలీసులు వుండబట్టి నా దగ్గరకికి వచ్చే సాహసం చేయలేకపోయారు ’ అని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు.

ఈ సమాజంలో ఎలా బతకాలో అర్థం కావటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వాల తీరు విషయంలో ప్రశ్నిస్తే కొందరు రాజకీయ నాయకులు తన మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి ప్రతిభావంతులు వస్తే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయరని అన్నారు.