బిడ్డ ప్రాణాలు కాపాడుకోవటానికి కమ్మవారి రక్తమే కావాలట - MicTv.in - Telugu News
mictv telugu

బిడ్డ ప్రాణాలు కాపాడుకోవటానికి కమ్మవారి రక్తమే కావాలట

March 29, 2018

రాను రాను మనుషులకు కులమతాల ఫీలింగ్ చాలా ఎక్కువ అయిపోతోంది. ఉన్నత విద్యావంతులు సైతం కులమతాల కుంపట్లు రాజేస్తున్నారు. మనదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని, లౌకికత్వానికి పెట్టింది పేరనే మాట కొందరి నిర్వాకాల వల్ల దాని మీద మచ్చ పడే అవకాశం కనిపిస్తోంది. అలాంటి ఓ కులగజ్జి గల మనిషి ఏకంగా సోషల్ మీడియాలో ఓ చిత్రవిచిత్రమైన పోస్ట్ పెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వార్త. తన మూడేళ్ళ బిడ్డకు ఆరోగ్యం బాగాలేదు. రక్తం అత్యవసరం అని డాక్టర్లు చెప్పారు. దీంతో అతను బ్లడ్ కోసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. కమ్మ కులం వారి రక్తం మాత్రమే కావాలని ‘ బ్లడ్ డోనర్స్ ఇండియా ’ గ్రూప్‌లో ఈ పోస్ట్ పెట్టాడు. కింద అతని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ తండ్రి ఇలా కులం ముసుగేసుకున్నాడు. ఈ వార్త తెలిసి చాలా మంది ‘ ఇదేం విడ్డూరం.. రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్టే చేస్తున్నారు మనుషులు ’ అని కామెంట్లు చేస్తున్నారు. ‘ ఒక వేళ కమ్మ కులం అతని రక్తం దొరక్క వేరే కులం వాళ్ళ రక్తం దొరికితే ఎలా ? వద్దని బిడ్డను చంపుకుంటాడా ఈ కులగజ్జి దౌర్భాగ్యుడని ’ విమర్శిస్తున్నారు.