ఈ రోజు టోల్ ఫీజు లేదు.. ఎంచక్కా వెళ్లిపోండి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ రోజు టోల్ ఫీజు లేదు.. ఎంచక్కా వెళ్లిపోండి..

December 7, 2018

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ వాసులు సొంత ఊళ్లకు బయలు‌దేరారు. టోల్ గేట్ల వద్ద రద్దీ పెరిగిపోయింది. గంటల తరబడి అక్కడే వేచి ఉండటంతో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ రోజు మొత్తం టోల్ ప్లాజాలను ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రద్దీ కారణంగా వాహనాలు బారులు తీరడంతో.. ఓటింగ్ పూర్తయ్యే సమయానికి తాము ఓటు వేయగలమో లేదోనని చాలా మంది ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లడంతో ఈసీ వెంటనే టోల్ ప్లాజాలను ఎత్తివేయాలని ఆదేశించింది.హైదరాబాద్ నగరం నుంచి చాలా మంది ఓటర్లు ఇప్పటికే తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు. కాగా సొంత వాహనాలు ఉన్నవారు శుక్రవారం ఉదయం ఊళ్లకు బయలుదేరారు. దీంతో ఒక్కసారిగా టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగిపోయింది. ఈసీ నిర్ణయంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి.