మృత్యుంజయుడు… రైలు ఢీకొట్టినా బతికి బట్టకట్టాడు… - MicTv.in - Telugu News
mictv telugu

మృత్యుంజయుడు… రైలు ఢీకొట్టినా బతికి బట్టకట్టాడు…

September 30, 2018

ఆయిశ్శు గట్టిగా వుండాలి గానీ మీదినుంచి లారీ పోయినా గాయాలతో సరిపెట్టుకుని బతికేస్తారు కొందరు. కానీ ఇక్కడో లక్కీమేన్ రైలు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువును ‘వెళ్ళు వెళ్ళు ఇక్కడెవరూ లేరు నీతో రావడానికి’ అని తిరిగి పంపించేశాడు. యమధర్మరాజు పిలుపును కూడా తిరస్కరించాడు. రైలు చక్రాలు అమాంతం అతని తల దగ్గరకు దూసుకొచ్చి ఆగిపోవడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. రైలు పట్టాల మీద తనను తన్నుకుపోవడానికి వచ్చిన మృత్యువును తరిమికొట్టిన ఈ ఘటన హైటెక్ సిటీ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. రైలు ట్రాక్‌ దాటుతున్న అతడిని ఒక్కసారిగా రైలొచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో అతన్ని కొంతదూరం ట్రాక్‌పై ఈడ్చుకెళ్లింది. ఆ దృశ్యం చూస్తే అతను ఖచ్చితంగా బతికి బట్టకట్టడనే అనిపిస్తుంది. కానీ బతికాడు. అదృష్టం అంటే నీదిరా అని అనిపించుకున్నాడు.

Lucky man… He had lived under the train

హైటెక్ సిటీ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. ఇంతలో రైటు కదిలింది. అతణ్ని ఢీకొట్టింది. కిందపడ్డ అతణ్ణి ఈడ్చుకుపోతోంది. ఇంకాస్త దూరం అలాగే పోతే అతను రైలుకింద చించిన బట్ట పేలికల్లా అయిపోతాడు. ఇంతలో తోటి ప్రయాణికులు రైలు కింద పడ్డతణ్ణి చూసి వెంటనే అరిచారు. రైలు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే రైలును ఆపే ప్రయత్నం చేశాడు. రైలును కొంచెం వెనక్కి పోనించి దానికింద చిక్కుకున్న వ్యక్తిని రక్షించారు. దీంతో రైలు కింద పడ్డ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలు కింద పడ్డ వ్యక్తి ఎవరు అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.