బావా.. నీకు లక్ష, నాకు 60 వేలు.. హరీశ్‌తో కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నానికి 48 శాతం పోలింగ్ నమోదైంది. పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో ఓటేసిన తర్వాత తన నియోజకవర్గమైన సిరిసిల్ల వెళ్లారు. మరో మంత్రి హరీశ్ రావు తన నియోజకవర్గం సిద్దిపేటలో ఓటేసి గ్రామాల్లో తిరుగుతూ ఓటింగ్ సరళి తెలుసుకుంటున్నారు.  ఈ బావా, బావమరదులు గుర్రాల గొంది గ్రామం వద్ద ఒకరికొకరు తారసపడ్డారు.  కార్లు దిగి కలుసుకుని ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి వారు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బావా, కంగ్రాట్స్.. నీకు లక్ష మెజారిటీ ఖాయం.. నాకు 60 వేల మెజారిటీ వస్తుంది.. సిరిసిల్ల పోతున్న..’ అని కేటీఆర్.. హరీశ్‌తో అన్నారు. రాష్ట్రంలో పోలింగ్ బాగా సాగుతోందని అన్నారు.