కాంగ్రెస్ గూటికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీతో అసంతృప్తిగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిన్న మూడు పేజీల రాజీనామా లేఖను పార్టీకి పంపించి రాజీనామా చేయడం జరిగింది.  వ్యక్తిగత కారణాలు, తెలంగాణ సాధన కోసం పోరాడిన కార్యకర్తలకు అన్యాయం, నియోజకవర్గ స్థాయిలో, పార్టీలో, రాష్ట్ర స్థాయిలో పలు సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. పార్టీలో సంప్రదాయ రాజకీయాలు లేవని ఆరోపించిన ఆయన ఎంపీగా తన నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేశానని పేర్కొన్నారు. పార్టీ రెండేళ్లుగా ప్రజలకు దూరమవుతోందని, ప్రభుత్వం కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆక్షేపించారు.

తాజా సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ కానున్నారు. రాహుల్ గాంధీని కలిసి తెలంగాణ రాజకీయ పరిస్థితులను వివరించనున్నట్టు సమాచారం. ఈ నెల 23 న మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ నివాసానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియాతో కలిసి వెళ్లనున్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి