టీఆర్ఎస్‌దే విజయం.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అటు ముగిశాయో లేదో, ఇటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేస్తున్నాయి. మళ్లీ టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, ఎవరి మద్దతూ అక్కర్లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పలు సంస్థలు అంచనా వేశాయి.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..  రాష్ట్రంలోని  మొత్తం 119 స్థానాలకు గాను టీఆర్ఎస్కు 66, కాంగ్రెస్కు 37, బీజేపీ, ఎంఐఎంలకు చెరో 7 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వస్తాయి.. రిపబ్లిక్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. టీఆర్ఎస్‌కు 50 నుంచి 65, కాంగ్రెస్‌కు 38 నుంచి 52 రావొచ్చు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆరా ఏజెన్సీ లెక్కల ప్రకారం.. గులాబీ దళానికి 75 నుంచి 85 వరకు, చేతికి 25 నుంచి 35, బీజేపీకి 2 లేదా, 3, మజ్లిస్ పార్టీకి 7 లేదా 8, ఇతరులకు 3 రావొచ్చు. ఇండియా మై యాక్సిస్ సర్వే.. టీఆర్ఎస్‌కు అత్యధిక సీట్లను ఊహిచింది. ఆ పార్టీకి 79 నుంచి 91, కాంగ్రెస్ పార్టీకి 21 నుంచి 23, బీజేపీకి 3 దాకా రావొచ్చని పేర్కొంది.

ఈ ఫలితాలు అధికార పార్టీకి నిరాశ కలిగించేవే. తమకు వందకుపైగా సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్, పార్టీలోని ఇతర అగ్రనేతలు చెబుతుండడం తెలిసిందే. అయితే ఎగ్జిట్ ఫలితాలను గులాబీ దళం కొట్టి పడేస్తోంది. తమకు వంద కచ్చితంగా వస్తాయని అంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 63సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 21, టీడీపీకి 15, ఎంఐఎంకు 7 దక్కగా, బీజేపీకి 5, ఇతరులకు 8 వచ్చాయి.

Telugu news TRs will win in Telangana assembly election with simple majority predicts timenow exit polls