కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్!  మీడియాకు మంచి మసాలా - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్!  మీడియాకు మంచి మసాలా

April 23, 2018

రెండు సంవత్సరాలకు ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ తన గతాన్ని సమీక్షించుకుని నాయకులకు, కార్యకర్తలకు నూతన ఉత్తేజాన్ని ఇవ్వడానికి పార్టీ  సమావేశాలను జరుపుకుంటుంది. ఏవో కొన్ని తీర్మానాలు చేసి పార్టీ శ్రేణులకు ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈసారి కూడా 12 వేల మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలతో గులాబీ దండు ప్లీనరీ సమావేశాలను జరుపుకుంటోంది. ఈ  నెల 24 నుంచి 27 వరకు కొంపల్లిలో ప్లీనరీ నిర్వహించనుంది. ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుని పూర్తి కమిటీ నియామక బాధ్యతలకు అప్పగించనుంది. టీఆర్ఎస్ పుట్టిన నాటి నుంచి కేసీఆర్ అధ్యక్షుడిగా వుంటూ వస్తున్నాడు.

టీఆర్ఎస్ ప్లీనరీ అంటే  మీడియాకు చప్పున గుర్తుకొచ్చే అంశం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సీఎం తనయుడు కేటీఆర్ లేదా కుమార్తె కవిత అంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి మీడియాలో  పుంఖానుపుంఖానులుగా కథనాలు వస్తున్నాయి. వాటిని టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తోంది. ఈ సారి జరిగే ప్లీనరీ సమావేశాల సందర్భంగా వర్కింగ్ ప్రెసిండెంట్ అనే అంశాన్నే మీడియా తెరమీదకు తీసుకువచ్చింది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటన రాబోతుందని ఊహాగానాలు మొదలు పెట్టింది. ఇందుకు కారణాలు కూడా వండే ప్రయత్నాలను చేసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో  పూర్తిగా నిగమ్నం అయ్యారని, కమిటి కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలను ఇవ్వనుందని అంచనా వేస్తోంది.

ఈ విషయాలను కేటీఆర్ దృష్టికి  మీడియా శ్రేణులు తీసుకుపోయాయి. దీనికి ఆయన  చాలా చమత్కరంగా సమాధానం ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ చాలా వేగంగా పని చేస్తున్నారని, తమ పార్టికి వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం లేదని తేల్చేశారు. అధ్యక్షుడు ఎక్కడైతే బలహీనంగా ఉంటాడో అలాంటి పార్టీలకు  వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరమని మీడియాకు చెప్పారు.