వెంకన్న దర్శనం మరింత సులభం..నేటి నుంచే కొత్త రూల్స్ - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్న దర్శనం మరింత సులభం..నేటి నుంచే కొత్త రూల్స్

December 18, 2017

సామాన్య భక్తుల కలలు సాకారం చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. శ్రీవారి ధర్మదర్శనానికి క్యూలైన్లలోకి చేరిన భక్తులు గంటల తరబడి నిరీక్షించే సమస్యకు పరిష్కారంగా ‘సమయ నిర్దేశిత సర్వదర్శనం’ విధానానికి శ్రీకారం చుడుతోంది. ఎంత ఆలస్యమైనా గరిష్ఠంగా 3 గంటలకు మించకుండా స్వామివారిని వీక్షించి, వెనుదిరిగేలా కొత్త విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం టోకెన్ల జారీ ప్రక్రియకు సర్వసన్నద్ధమైంది. సోమవారం ఉదయం 6 గంటలకు శుభ ముహూర్తంగా ఖరారు చేసింది. తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభమైంది. సోమవారం నుంచి ఈనెల 23 వరకు 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి.. ఈ అనుభవాలతో పకడ్బందీ ప్రణాళిక తయారు చేయనుంది. మరో రెండు మూడు నెలల తర్వాత ఈ విధానాన్ని శాశ్వతంగా అమలు చేయనుంది.ప్రత్యేక ఏర్పాట్లు… 

సర్వదర్శనం టోకెన్ల జారీకి తిరుమల వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో 117 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 80 మంది అధికారుల పర్యవేక్షణలో 4400 మంది సిబ్బందికి మూడు దఫాలుగా విధులు కేటాయిస్తోంది. ప్రస్తుతం సామాన్య భక్తులకు మినహా ఇతరులకు తితిదే అన్ని రకాల ఏర్పాట్లతో శ్రీవారి దర్శనం శీఘ్రంగా చేయిస్తోంది. రూ.300 టిక్కెట్‌పై ‘ప్రత్యేక ప్రవేశ దర్శనం’, కాలినడకన వచ్చే వారికి ‘దివ్యదర్శనం’ పేరిట నిర్దేశిత సమయంలో స్వామి దర్శనం చేయిస్తోంది. ‘సమయ నిర్దేశిత సర్వదర్శనం’ కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. భక్తులు తమ వీలును బట్టి కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు తదితర ఆలయాల సందర్శనను చేసుకోవచ్చని తితిదే భావిస్తున్నట్టు సమాచారం.

టోకెన్ల జారీ కేంద్రాలివే… 

కేంద్రీయ విచారణ కార్యాలయం(సీఆర్వో), సప్తగిరి సత్రాలు, కౌస్తుభం విశ్రాంతి సముదాయం, సన్నిధానం, ఆర్టీసీ బస్టాండు, పద్మావతినగర్‌ డిపాజిట్‌ తిరిగి చెల్లింపు కేంద్రం, ఎంబీసీ-26 లగేజీ కేంద్రం, ఏటీసీ, శ్రీవరాహస్వామి, నందకం విశ్రాంతి సముదాయాలు, కల్యాణవేదిక, అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే కాలిబాటలో గాలిగోపురం, శ్రీవారిమెట్టు మార్గం, ఆళ్వారు ట్యాంకు చెరువుగట్టు వద్ద టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇలా చేయాలి… 

 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు కోరుకునే భక్తులు ఆయా కేంద్రాల వద్దకు వచ్చి ఆధార్‌కార్డులు తప్పనిసరిగా చూపించాలి. ఆ కేంద్రం వద్దకు చేరుకున్న సమయం నుంచి 24 గంటల వ్యవధిలోగా ఖాళీగా ఉన్న స్లాట్‌ను తమ ఇష్టం మేరకు ఎంపిక చేసుకొని సిబ్బందికి చెప్పాల్సి ఉంటుంది. 

టోకెన్‌పై కేటాయించిన సమయం మేరకు ఏటీసీ సమీపంలోని దివ్యదర్శనం సముదాయానికి చేరుకోవాలి. అక్కడ దానిని తనిఖీ చేస్తారు. అక్కడే లడ్డూ ప్రసాదం టోకెన్‌కు నగదు చెల్లించి శ్రీవారి దర్శనానికి వరుసలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.  ఆధార్‌కార్డులు లేని భక్తులు పాత పద్ధతిలో మాదిరిగా సర్వదర్శనానికి వైకుంఠం-2లోకి చేరుకోవాల్సి ఉంటుంది