శ్రీశైలంలో బయటపడ్డ సొరంగం.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీశైలంలో బయటపడ్డ సొరంగం..

February 1, 2018

శ్రీశైలం రుద్రాక్ష మఠంలో సుమారు 6 అడుగుల లోతైన సొరంగం బయట పడింది. అభివృద్ధి పనుల కోసం పోలీస్ అధికారులు, దేవస్థానం ఆధ్వర్యంలో జరిపిన తవ్వకాలలో ఈ సొరంగం బయట పడింది. సొరంగంలోని నేలమాళిగ 3.5 అడుగుల ఎత్తు, 4.5 చదరపు అడుగుల వెడల్పు వున్న భూగర్భ గదిగా గుర్తించారు.

గది పైకప్పు రాతిబండతో ఉండగా, చుట్టూ మూడువైపులా రాతికట్టడంతో కూడిన గోడలు ఉన్నాయి. ఒక వ్యక్తి దూరి వెళ్లేంత ప్రవేశ ద్వారం ఉంది. ఈ తవ్వకాలలో పురాత‌న వ‌స్తువులు లభించాయి. అవి ఎనిమిదో శతాబ్ధానికి చెందినవిగా గుర్తించారు. వాటిల్లో పూజ, వంట సామగ్రి అధికంగా ఉన్నాయి.

ఇత్తడి, రాగి లోహాలతో తయారైన పూజా సామాగ్రిలో 2 బేసిన్లు, ఒక బాండి, ఒక ధూప పాత్ర, 2 పెద్ద గుడి గంటలు, 3 చిన్న పూజా మందిర గుడి గంటలు, 26 చెంబులు, ఒక గిన్నె, 6 చిన్న గజ్జెలు, 2 కడియాలు, 5 గుండ్రటి గిన్నెలు, విరిగిన ప్లేట్లు సహా 19 ఇతర సామాన్లు బయట పడ్డాయి. వీటిని బట్టి పూర్వం మఠాధిపతుల కాలంలో ఈ గదిని పూజా మందిరంగా వినియోగించి ఉండొచ్చని భావిస్తున్నారు.