భార్యను కొట్టడం తప్పు కాదు: ఉగాండా ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

భార్యను కొట్టడం తప్పు కాదు: ఉగాండా ఎంపీ

March 15, 2018

భార్యను కొట్టడం తప్పు కాదట. ఈ మాటన్నది.. ఎవరో దారిన పోయే దానయ్యో లేక  ఫుల్ జోష్‌లో ఉన్న మందు బాబో కాదు. ప్రజల జీవితాలను చక్కదిద్దుతాడని ఓట్లు వేసి మరీ గెలిపించుకున్న ఓ ఎంపీ. ఉగాండా దేశానికి చెందిన ఎంపీ ఒనెమస్‌ ట్వినామసికో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో అతను మాట్లాడుతూ‘ ప్రతీ పురుషుడు భార్యపై పైచేయి సాధించాలి. మహిళలను క్రమశిక్షణలో పెట్టాలనుకున్నపుడు వారిని కొట్టడంలో ఏమాత్రం తప్పులేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనితో అక్కడి మహిళా లోకం ఒక్కసారిగా భగ్గుమంది. వెంటనే ఆ ఎంపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా  ర్యాలీలు, నిరసనలు చేశారు.

మహిళల కోపం తన పదవికే ఎసరు పెట్టేటట్టుంది అని గమనించిన ఆ ఎంపీ ఆ తర్వాత మాట మార్చాడు. తనకు మహిళలంటే చాలా గౌరవమని, ఆడవాళ్ల పట్ల జరుగుతున్న హింసకు తాను వ్యతిరేకిని అని చెప్పుకొచ్చాడు. అదేదో పొరపాటున అన్నట్లు ఒప్పుకున్నాడు. అయితే ఉగాండా ప్రభుత్వ నివేదిక ప్రకారం 2016లో ప్రతీ ఐదుగురు మహిళల్లో  ఒకరు మానసిక, భౌతిక దాడులకు గురి అయిన వారే అని తేలింది.