100 సేవలతో ఉమంగ్ యాప్ - MicTv.in - Telugu News
mictv telugu

100 సేవలతో ఉమంగ్ యాప్

November 24, 2017

స్మార్ట్ ఫోన్ వచ్చాక అన్నీ బిల్లులు ఫోను ద్వారానే కట్టుకుంటున్నాం. ఈ క్రమంలో ఒక్కొక్క బిల్లుకు ఒక్కొక్క యాప్ వుంటుంది. గ్యాస్, కరెంట్, ఇన్‌కమ్‌ట్యాక్స్ ఫైలింగ్, పీఎఫ్ చెకింగ్, ఈ-ఆధార్ వంటివాటికి సపరేటుగా యాపులు వుంటాయి. ఇలా రకరకాల యాపులతో మొబైల్ నిండిపోతుంటుంది. ఇప్పుడలాంటి రకరకాల యాప్’ల తలనొప్పి లేకుండా యాప్’లన్నీ ఒకే గొడుగు కింద వుంటే ఎలా వుంటుందనే ఉపాయంలోంచి పుట్టిందే ‘ఉమంగ్ ’ యాప్.  సైబర్ స్పేస్ అంశంపై గురువారం ఢిల్లీలో జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ ఈ యాప్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చేందుకు డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 100 రకాల సేవలను ఒకే ప్లాట్‌ఫాం మీదకు తేవడమే ముఖ్య ఉద్దేశమన్నారు.  ఈ యాప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ ( ఉమంగ్ ) పేరుతో రూపొందించింది. ప్రస్తుతం 45 సేవలను అనుసంధానించారు. త్వరలో వీటిని వందకు విస్తరించనున్నారు. ఇక నుండీ అన్నీ రకాల బిల్లులు ఉమంగ్‌లో చెల్లించవచ్చు. వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఉమంగ్‌లో పొందవచ్చన్నమాట.

కంప్యూటర్ వెర్షన్‌తోపాటు, ఐవీఆర్, ఎస్‌ఎంఎస్ ద్వారా ఫీచర్ ఫోన్లలోనూ సేవలు పొందేలా ఉమంగ్‌లో ఏర్పాట్లు చేశారు. వినియోగదారులు ముందుగా ప్లేస్టోర్‌కు వెళ్లి ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా 97183 97183 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇస్తే లింక్ వస్తుంది. ఈ లింక్ ఆధారంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులోని అప్లికేషన్‌లో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాలు, తదితర వివరాలు నమోదు చేసి ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి మనకు కావాల్సిన సేవలను వినియోగించుకోవచ్చు. దీనికి అనుసంధానంగా కస్టమర్‌కేర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.