బిల్లు వెనక్కి తీసుకోవాలి.. విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నం - MicTv.in - Telugu News
mictv telugu

బిల్లు వెనక్కి తీసుకోవాలి.. విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నం

March 29, 2018

ఇష్టారాజ్యంగా లక్షల్లో ఫీజుల వసూలు చేసుకునేలా వున్న ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం నినాదాలు చేపట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాల నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా.. వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ యూనివర్సిటీలను భ్రష్టు పట్టించే కుట్రలో భాగంగానే ఈ బిల్లును తీసుకొస్తున్నారని.. ప్రభుత్వ విద్యను నిర్వీర్యంచేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందంటూ నినాదాలు చేశారు. ఉస్మానియా వర్సిటీలో సైతం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, ప్రైవేటు వర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం తాము ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైందని ఏబీవీపీ నేత మట్ట రాఘవేందర్ పేర్కొన్నారు. తెలంగాణ వస్తే.. ఉద్యోగాలు, నిధులు వస్తాయనుకుంటే.. రాష్ట్రంలో 4 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టుచేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కి తరలించారు.సామాజిక రిజర్వేషన్లు లేని ప్రైవేటు వర్సిటీలను అనుమతించొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలు ఫీ రెగ్యులేటరీ పరిధిలోకి రాకపోవడంతో ఫీజుల దోపిడీ జరుగుతుందని చెప్పారు. ఇదిలా వుండగా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ, గ్రూప్-2ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్‌సీసీ గేటు వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా గ్రూప్-2 పరీక్షను రద్దు చేసి.. తిరిగి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.

ఈ బిల్లుకు వ్యతిరేకంగా జేఎన్‌టీయూహెచ్‌లోని ఉపాధ్యాయ సంఘాలు కూడా తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. ఈ బిల్లు వల్ల బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను పూర్తిగా దూరం చేసినట్టేనని తెలిపారు. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.