రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్.. కానీ అరెస్ట్ చేయరంట.. - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్.. కానీ అరెస్ట్ చేయరంట..

April 12, 2018

ఎట్టకేలకు యూపీ ప్రభుత్వం బెట్టు తగ్గించుకొని మెట్టు దిగింది. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదురుకుంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ వ్యవహారం  దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పెనుదూమారం రేగుతున్న ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.  అయితే అతని వ్యతిరేకంగా గట్టి సాక్ష్యాలు లభించేంతవరకు అరెస్ట్ చేయబోమని పోలీసులు తేల్చిచెప్పారు. బీజేపీ పెద్దలు కుల్దీప్ కు కొమ్ముకాస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.తాను బాలికను రేప్ చేయలేదని, ఆమె తండ్రి మరణానికి నేను కారకుణ్ణి కానని నమ్మబలకటానికి కుల్దీప్ సింగ్ ప్రయత్నించారు. దీనికి ఊతమిస్తూ లక్నో పోలీస్ చీఫ్ అధికారిక నివాసం ఎదుట కుల్దీప్ కనిపించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించాలని నిర్ణయం తీసుకుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఇది పెద్ద షాక్. రేప్ బాధితురాలి తండ్రికి వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు జైలు వైద్యులపై క్షమశిక్షణ చర్యలకు ఆదేశించింది. బాధిత కుటుంబం ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందించని డీఎస్పీ స్థాయి అధికారిని సస్పెండ్ చేసింది. ఉన్నవో జిల్లా ఆసుపత్రికి చెందిన ఇద్దరు సీనియర్ వైద్యుల పైనా ప్రభుత్వం వేటు వేయటం గమనార్హం.