పోలీసుల దిగ్బంధంలో ఉప్పల్ స్టేడియం 

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రేపు జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా 1800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  రేపు సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఉండటం వల్ల, 4 గంటలకు స్టేడియం గేట్లు ఓపెన్ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఈ కెమెరాలన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమయ్యాయని తెలియజేశారు. మొబైల్ ఫోన్‌ను స్టేడియంలోకి అనుమతిస్తామని, అయితే పవర్ బ్యాంక్‌ను మాత్రం తీసుకురావద్దని చెప్పారు. లాప్‌టాప్స్, కెమెరాలు, హెల్మెట్లు, బ్యాగులు, పెన్నులు, సిగరెట్లు, అగ్గిపెట్టె, లైటర్, వాటర్ బాటిల్స్‌కు స్టేడియంలో అనుమతి లేదన్నారు. అమ్మాయిలను వేధించే పోకిరీలను కట్టడి చేసేందుకు షీ టీమ్స్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో నిఘా వేసి ఉంటాయని పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.

SHARE