రంగు పడుతుందని మసీదును ఇలా దాచేశారు..! - MicTv.in - Telugu News
mictv telugu

రంగు పడుతుందని మసీదును ఇలా దాచేశారు..!

March 2, 2018

హోళీ పండుగ సందర్భంగా ఓ  మసీదును బట్టలతో కప్పేశారు.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జరిగింది. అలీఘడ్‌లో హిందూ, ముస్లింల మధ్య గొడవలు మామూలే. దానికి తోడు ఈసారి హోళీ  పండుగ, ముస్లింలు ప్రార్థనలు చేసుకునే  శుక్రవారం రోజునే వచ్చింది. దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోళీ సందర్బంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జగరకుండా చూడాలని యోగి సర్కార్ పోలీసులను ఆదేశించింది.వేరే మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలపై ఉద్దేశపూర్వకంగాగాని, అనుకోకుండాగాని రంగులు పడకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేని సర్కారు స్పష్టం చేసింది.హోళీ సందర్భంగా మసీదుల్లోకి రంగు నీళ్లు నింపిన బెలూన్లు విసరడం గత కొన్నేళ్ల నుంచి  ఎక్కువ అవడంతో ఈసారి అలీఘడ్‌ కూరగాయల మార్కెట్‌లో ఉన్న మసీదును బట్టలతో కప్పేశారు. శుక్రవారం మధ్యాహ్నం పూట చేసే నమాజ్ సమయాన్ని కూడా అరగంట ముందుకు జరిపారు. అందుకు  ముస్లింలు కూడా పోలీసులకు సహకరించారు. రంగులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై కూడా ఉంది కాబట్టి మసీదును బట్టలతో కప్పేశామని ముస్లింలు తెలిపారు.