కొడుకు కోసం.. సైకిల్‌పై 1500 కి.మీ. - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకు కోసం.. సైకిల్‌పై 1500 కి.మీ.

December 2, 2017

కడుపు తీపిని ఏ మాటలకూ అందదు. ఓ తండ్రి.. తప్పిపోయిన తన కొడుకు కోసం గత ఐదు  నెలలుగా సైకిలు తొక్కుతూనే ఉన్నాడు. ఇప్పటివరకు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. కొడుకు కోసం కనిపించిన వారినల్లా అడుగుతూనే ఉన్నాడు.. బిడ్డడి ఫొటో చూపించి.. అభ్యర్థిస్తున్నాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయినా నిరాశపడ్డం లేదు. కరపత్రాలను పంచిపెడుతున్నాడు.  బస్టాప్‌, రైల్వేస్టేషన్లలో టీషాపులు, దుకాణదారుల ఫోన్‌నెంబర్లను సేకరిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన చాంద్‌ కుమారుడు గోడ్నా. జూన్ 24 నుంచి కనిపించకుండా పోయాడు. పాఠశాలకు వెళ్లిన పిల్లాడు సాయంత్రం ఇంటికి రాలేదు. పాఠశాలకు వెళ్లి అడిగితే సమాధానం ఏం చెప్పలేదు. కొందరు రైల్వే స్టేషన్‌లో కనిపించాడని చెప్పారు. అక్కడ వెతికినప్పటికి ఫలితం లేదు. దాంతో పోలీసులకు  జూన్ 28న ఫిర్యాదు చేశాడు చాంద్. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోలేదు.

దాంతో చేసేది లేక తన సైకిల్‌నే  ఆశ్రయించాడు. చేతిలో ఉన్న కొద్ది మెుత్తంలో తనయుడిని వెతకడం ప్రారంభించాడు. ఫోటో పట్టుకుని కనిపించి వారిని ‘ఈ ఫోటోలోని మా అబ్బాయిని చూశారా’ అంటూ దీనంగా అడుగుతున్నాడు.  అయితే అబ్బాయిని మేం చూడలేదు అన్న సమాధానంతో నిరాశగా వెనుదిరుగుతున్నాడు.  అలా గత ఐదు నెలల నుంచి 1500 కిలోమీటర్లు ప్రయాణించాడు . ఢిల్లీ, కాన్పూర్ , హరియాణాలోని కొన్ని ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది.

‘నా పెద్ద కుమార్తె సరిత దీర్ఘకాలిక వ్యాధితో  2005లో మరణించింది. 2011లో జరిగిన ప్రమాదంలో 9 ఏళ్ల చిన్న కుమారుడు మరణించాడు. ఇప్పుడు తన ఆశలన్నీ పెట్టుకున్న గోడ్నా తప్పిపోయాడు, వాడు లేకుంటే నేను, నా భార్య బతకలేం’ అంటూ కంటతడి పెట్టుకున్నాడు చాంద్. కొడుకు కోసం వెతుకుతున్న ఈ తండ్రి గురించి తెలుసుకున్న ఆగ్రా బాలల హక్కుల కార్యకర్త ఒకరు పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. దాంతో తగిన చర్యలు తీసుకోవాలని పై నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.  మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ఫిర్యాదుల విభాగానికి సైతం ఆయన వినతిపత్రం సమర్పించారు.