గాడిదలకు జైలుశిక్ష.. బెయిల్‌పై విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

గాడిదలకు జైలుశిక్ష.. బెయిల్‌పై విడుదల

November 28, 2017

నేరాలు చేసిన మనుషులనే జైల్లో పెడతారని మనకు తెలుసు. అయితే చాలా విషయాల్లో అతి చేసే ఉత్తరప్రదేశ్ పోలీసులు 8  గాడిదలను కూడా జైల్లోకి తోశారు. జలన్ జిల్లా ఉర్తె జైల్లో ఈ విడ్డూరం చోటుచేసుకుంది. నాలుగు రోజుల జైలు శిక్ష తర్వాత  ఆ మూగ జీవులు బెయిల్‌పై విడుదలై బతుకు జీవుడా అంటూ తోక ఊపుకుంటూ బయటికొచ్చాయి. క్షణాల్లో సెలబ్రిటీలు అయిపోయాయి.

ఇంతకూ  ఆ  గాడిదల చేసిన నేరమేంటంటే.. జైలు కాంపౌండ్‌లోని  లక్షల ఖరీదైన మెుక్కల్ని నాశనం చేయడం.  తమ సినీయర్ అధికారి జైలు లోపల నాటిన ఈ  మెుక్కలను ఈ గాడిదలు నాశనం చేశాయని, అందులో జైల్లో పెట్టామని హెడ్ కానిస్టేబుల్ ఆర్ కే మిశ్రా చెప్పారు.

గాడిదలను బయటికి వదలదంటూ చాలా సార్లు వాటి యాజమానిని హెచ్చరించినా అతడు  వినిపించుకోలేదని, దాంతో గాడిదలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

జైల్లో మగ్గిపోతున్న గాడిదలకు ఓ స్థానిక రాజకీయ నాయకుడు బెయిల్ మెుత్తాన్ని చెల్లించి, విడిపించాడు. వాటిని యజమాని కమలేశ్ తోలుకెళ్లిపోయాడు.

దీనిపై సోషల్ మీడియాలో సటైర్లు పేలుతున్నాయి. అసలు గాడిదలు జైల్లోకి వెళ్తుంటే అక్కడి సిబ్బంది ఏం చేశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జైల్లో పెట్టాల్సింది గాడిదలను కాదు, అక్కడి సిబ్బందిని అని అంటున్నారు. జైలు సిబ్బందిపై జంతు హింస కింద కేసు పెట్టాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.