ఆ జైల్లో ఏకంగా 23 మందికి ఎయిడ్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ జైల్లో ఏకంగా 23 మందికి ఎయిడ్స్

February 28, 2018

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జైల్లో ఏకంగా  23 మంది ఖైదీలకు ఎయిడ్స్  వ్యాధి సోకింది.  గత కొన్ని నెలల నుంచి వైద్యులు జిల్లా ఖైదీలకు సాధారణ పరీక్షలు  నిర్వహిస్తున్నారు.  23 మందికి హెచ్ఐవీ వైరస్ సోకిందని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని తేలింది. ఈ రోగుల్లో ఓ మహిళ కూడా ఉంది. ప్రస్తుతం వారంతా  బీఆర్డీ వైద్య కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు.  హెచ్‌ఐవీ సోకిన వారంతా విచారణ ఖైదీలని, అసలు హెచ్ఐవీ ఎలా సోకిందో  తెలియాల్సి ఉందని  అధికారులు చెప్పారు. జైల్లోని ఎక్కువ మంది ఖైదీలకు హై బీపీ, మధుమేహం సమస్యలున్నాయని  వైద్య పరీక్షల్లో తేలింది. ఎయిడ్స్ బాధిత ఖైదీలకు కౌన్సెలింగ్ చేస్తున్నారు.

మరోవైపు యూపీలోని అన్ని జైళ్లలో హెచ్ఐవీ ఉన్న ఖైదీలను గుర్తించి, సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జైళ్ల శాఖ పేర్కొంది. ఇటీవలే ఉన్నావ్ జిల్లాలో కేవలం మూడు గ్రామాల్లోనే  58 మందికి హెచ్‌ఐవీ సోకినట్టు వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఒక డాక్టర్ వాడిన సిరంజీ వల్ల వీరు వ్యాధిబారిన పడ్డారు.