సీసీ కెమెరాలు పెట్టారని 5లక్షల మంది పరీక్షకు డుమ్మా! - MicTv.in - Telugu News
mictv telugu

సీసీ కెమెరాలు పెట్టారని 5లక్షల మంది పరీక్షకు డుమ్మా!

February 8, 2018

ఉత్తరప్రదేశ్‌లో ఉత్తమ విద్యార్థులు చాలామందే ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఈ మధ్యే జరిగిన పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష హాళ్లలో అక్కడి ప్రభుత్వం సీసీ కెమెరాలు పెట్టింది. అంతే  రెండు రోజుల్లో ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు డుమ్మా కొట్టారు.

ఈమధ్య రాష్ట్రంలో ఎక్కడ చూసినా చూచి రాతలు ఎక్కువయ్యాయని, దీనితో కష్టపడి చదివిన విద్యార్థులు నష్టపోతున్నారని అక్కడి విద్యాశాఖామంత్రి సీసీ కెమెరాల ఆలోచన చేశారు. అంతేకాదు పరీక్షలు సజావుగా సాగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ఓ హెలికాప్టర్‌ను కూడా ఉపయోగిస్తున్నారు మంత్రి. ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేశారు.

మరి ఇన్ని గట్టి బందోబస్తులు తీసుకున్నాక సదువు దొంగలు ఏం చేస్తారు పాపం.. పరీక్షలు రాసి ఫేయిల్ అవ్వడం కన్నా రాయకుంటేనే మంచిది అనుకున్నారేమో అందుకే ఏకంగా 5 లక్షలమంది డుమ్మా కొట్టారు. ఈ యేడాది మొత్తం 66 లక్షలమంది విద్యార్థులు పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాయాల్సిఉంటే, సీసీ కెమెరాల కారణంగా మొదటి రెండు రోజుల్లోనే దాదాపు 5 లక్షలమంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. మరి  తర్వాత జరగబోయే పరీక్షలకు ఇంకెంతమంది డుమ్మా కొడతారో అని అక్కడి టీచర్లు, అధికారులు చర్చించుకుంటున్నారట