వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ షాక్

January 31, 2018

వివాదాల దర్శకుడు వర్మ తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్(జీఎస్టీ) సినిమా  ఇకపై విమియో వెబ్ సైట్ లో ఉచితంగా చూడడం వీలుకాదు. ఎందుకంటే దానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ పెట్టారు. వర్మ తీసిన జీఎస్టీకి మొదట డబ్బులు కట్టాలంటూ ఆ తర్వాత ఫ్రీగా వెబ్‌సైట్ లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాపై తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వాటిని దృష్టిలో పెట్టుకుని..ఈసినిమాను ఇండియాలో ఫ్రీగా చూసే అవకాశాన్ని రద్దు చెయ్యాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ సదరు వెబ్‌సైట్ ను కోరారు.

దీనితో విమియో వెబ్‌సైట్ జీఎస్టీని ఉచితంగా చూసే అవకాశాన్ని ఇండియాలో రద్దు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు.  సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ.. అసలు వర్మ జీఎస్టీని ఇండియాలో డబ్బులు పెట్టి చూసే వెసులు బాటు కూడా లేకుండా పూర్తిగా రద్దు చేయాలని విమియో వెబ్ సైట్ ను కోరారు. దీనిపై వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే ఇప్పటికే లక్షలమంది దాన్ని చూసి డౌన్ లోడ్ చేసి వివిద వెబ్ సైట్లలో అప్‌లోడ్ కూడా చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఏంటి ? ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తొందరలోనే జీఎస్టీ రెండో పార్ట్ ను కూడా తెరకెక్కిస్తానని వర్మ చెప్పడం విశేషం.