అందంగా లేకున్నా హీరో కొడుకు హీరో.. ఈ కామెంట్ ఎవరిపైన? - MicTv.in - Telugu News
mictv telugu

అందంగా లేకున్నా హీరో కొడుకు హీరో.. ఈ కామెంట్ ఎవరిపైన?

February 3, 2018

130 కోట్ల మందికి అన్నం పెట్టే రైతు మాత్రం తన సంతానంలో ఒక్కరు కూడా రైతు కావాలని కోరుకోడు ఎందుకంటే మనదేశంలో రైతులు గోసలు అలాంటివి. వాతావరణం అనుకూలించక పంటలు పండవు. ఒకవేళ పండినా..పండిన పంటకు గిట్టుబాటు ధర రాదు. రైతుల గోసలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.గుంటూరు జిల్లా  పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగిన స్వర్ణోత్సవాలను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన రైతుల గురించి మాట్లాడుతూ ‘డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు. అందంగా లేకపోయినా హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతు మాత్రం తన కొడుకును రైతు చెయ్యాలనుకోవడం లేదు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. రైతు సంతోషంగా  ఉండాలి. తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి, విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశానికి తెప్పించే స్థాయికి ఎదగాలి. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు, రైతు జీవితంలో ఇకనైనా మార్పు రావాలి’ అని ఆయన అన్నారు.

అందంగా లేకపోయినా హీరోల కొడుకులు హీరోలు హీరోలు అవుతున్నారంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆయన రెండు మూడు కుటుంబాలను ఉద్దేశించిన ఈ వ్యాఖ్యలు చేశారని, ఆయన అన్నదాంట్లో తప్పేమీ లేదని అంటున్నారు. అయితే సినీవారసత్వం లేని  కొత్త నటులకు కూడా పరిశ్రమ చోటు కల్పిస్తోందని చెబుతున్నారు.