విషం తాగించి చంపారు.. ఎన్నాళ్లీ కులహత్యలు? - MicTv.in - Telugu News
mictv telugu

విషం తాగించి చంపారు.. ఎన్నాళ్లీ కులహత్యలు?

March 3, 2018

బహుశా ఈ దేశంలో కులాల కుంపట్లు రగిలించే జ్వాలలు ఎప్పటికీ చల్లారవు అనటానికి ఇది తాజా ఉదాహరణ. కన్నకూతురు తమ కులం కానివాణ్ణి పెళ్లి చేసుకుందని ఆ తల్లిదండ్రులు కూతురికి విషం ఇచ్చి చంపారు. అత్యంత విషాదకర ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు సమీపంలోని గొల్లాన్‌బేడులో చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. గొల్లాన్‌బేడ్‌కు చెందిన సుష్మ (20) తమ పక్క గ్రామానికి చెందిన దళిత యువకుడితో  ప్రేమలో పడింది. అయితే వారి ప్రేమను తండ్రి కుమార్ గౌడ, తల్లి జయంతి, మేనమామ కెంపన్నలు తీవ్రంగా వ్యతిరేకించారు. సుష్మ మాత్రం ఆ యువకుడిని వదులుకోనని తెగేసి చెప్పి అతడిని పెళ్లిచేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. గత డిసెంబరులో కొందరు పెద్దలను వెంటబెట్టుకుని సుష్మ దగ్గరకు వెళ్లిన కుమార గౌడ, అతడిని వదిలి వచ్చేయాలని కోరాడు. అయితే దీనికి ఆమె నిరాకరించింది. అలా పలుమార్లు కూతురు మనసు మార్చి తమకు నచ్చిన కుర్రాడికిచ్చి పెళ్ళి చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ సుష్మ కట్టుకున్నవాణ్ణి వదలనని తెగేసి చెప్పింది.

దీంతో వారు కూతురిని చంపెయ్యాలని ప్లాన్ వేసుకున్నారు.  చివరిగా ఫిబ్రవరి 20 న ఆమెను ఇంటికి పిలిచి పళ్ళరసంలో విషం కలిపి ఇచ్చారు. కొంత తాగాక చేదుగా వుందంది సుష్మ చెప్పింది. తమ వ్యూహం బెడిసికొడుతుందని భావించిన కుమార గౌడ, జయంతి, కెంపన్నలు బలవంతంగా ఆమె గొంతులో పోశారు. విష ప్రభావంతో ఆమె ఆరు గంటలు విలవిల్లాడింది. కన్నకూతురు తనను బతికించమని ఎంతగా బతిమాలినా ఆ కన్నవాళ్ళ కటిక హృదయం కరగలేదు. కాళ్ళూచేతులు కొట్టుకొని కళ్ళ ముందే కన్నపేగు చనిపోయినా వారి గుండె కరగలేదు. కూతురు కన్నా వారికి పరువే ముఖ్యమైంది. కుమార్తెను చంపి ఉన్నపళంగా అంత్యక్రియలు నిర్వహించారు. బయట ఇది పరువుహత్య అని ప్రచారం అవటంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.