పైలట్ ఫస్ట్ జర్నీ.. అమ్మ, అమ్మమ్మ కాళ్లకు మొక్కి..

బాగా కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాక, తొలి సంపాదనతో ఇంట్లోవాళ్ళకు స్వీట్లు, బట్టలు, బంగారం కొని పెడుతుంటారు కొందరు. ఇలా చాలామంది చిన్నప్పటి నుంచి కలలు కని నిజం చేసుకుంటారు. అతడు కూడా పైలట్ కావాలనుకున్నాడు. తను మొదటిసారి విమానం నడిపితే అందులో అమ్మను, అమ్మమ్మను, సోదరిని కూర్చుండబెట్టి నడుపుతానని చెప్పేవాడు. కల నెరవేరింది. పైలట్ అయ్యాడు. ఇంకేం.. అమ్మ, అమ్మమ్మలతో కలసి గగనతలంలో విహరించాడు.

 

  

చెన్నైకి చెందిన ప్రదీప్‌ కృష్ణన్‌‌కు ఇండిగో సంస్థలో పైలట్‌గా ఉద్యోగం వచ్చింది. తొలి డ్యూటీ సింగపూర్‌ వెళ్లే విమానంలో పడింది.  అనుకున్నట్టుగానే తన మొదటి డ్రైవ్‌లో అమ్మ, అమ్మమ్మ, సోదరిలను తీసుకెళ్ళాడు. వాళ్ళకు కూడా విమాన ప్రయాణం తొలిసారి. అందునా కొడుకే పైలట్‌గా మారడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చున్న తర్వాత విమానం టేకాఫ్‌కు ముందు కృష్ణన్‌ తన తల్లి, అమ్మమ్మ వద్దకు వచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మనవడి ప్రేమకు కరిగిపోయిందా అమ్మమ్మ. కృష్ణన్ చేయి పట్టుకుని గర్వంతో ముద్దాడింది. ఈవీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను కృష్ణన్‌ స్నేహితుడు నాగార్జున్‌ ద్వారక్‌నాథ్‌ తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ‘కలలు సాకారమైన క్షణాలివి. నా రూంమేట్‌ ప్రదీప్‌ కృష్ణన్‌ ఇండిగో సంస్థలో ఉద్యోగం సాధించిన తర్వాత మొదటిసారి విమానం నడపబోతున్నాడు. అందులోనే అతని తల్లి, అమ్మమ్మ, సోదరిని మొదటిసారి విమానంలో తీసుకెళ్తున్నాడు. 2007లో స్టూడెంట్‌ పైలట్‌గా శిక్షణ మొదలు పెట్టాం. విమానాన్ని నడిపేందుకు 11 ఏళ్లు పట్టింది’ అని చక్కగా రాసి వీడియోను షేర్ చేశాడు. నిజంగా ఇవి గర్వించదగ్గ క్షణాలే అంటూ చాలా మంది యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఎవరి విజయానికైనా ఇంటి నుంచే బీజం పడుతుంది. విజయం సాధించాక ఇంటివాళ్ళకు కృష్ణన్ ఇచ్చిన గౌరవం చాలా గొప్పది’ అని మరొకరు కామెంట్ చేశారు.

Telugu news Video of Pilot Taking Blessings from Mother and Grandmother on their Maiden Flight goes Viral