నా  గర్ల్ ఫ్రెండ్‌తో రోజూ గొడవలే… - MicTv.in - Telugu News
mictv telugu

నా  గర్ల్ ఫ్రెండ్‌తో రోజూ గొడవలే…

December 19, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో భారీ  విజయం సాధించాడు విజయ్ దేవరకొండ. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు విశేష  ప్రేక్షకుల ఆదరణ లభించింది. కానీ అర్జున్ రెడ్డి పాత్రలో నటించిన విజయ్‌కి మాత్రం  సమస్యలను తెచ్చిపెట్టిందట.  ప్రస్తుతం ‘ఏ మంత్రం వేశావె’ చిత్రంలో నటిస్తున్నాడు ఈ కుర్రహీరో.. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నాడు.‘‘అర్జున్ రెడ్డి’ సినిమా చేసిన తర్వాత నా  గర్ల్ ఫ్రెండ్‌తో తరుచూ గొడవలే జరుగుతున్నాయి. అందుకే నాకు ఆ సినిమా చాలా కష్టంగా అనిపించింది. సినిమా చేస్తున్నంత సేపూ టాలీవుడ్‌లో ఇదివరకు ఎప్పుడూ ఎవ్వరూ చేయని సినిమా చేస్తున్నానని అనిపించింది. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు  నచ్చుతుంది అనిపించింది. అలాగే అంచనాలకు తగ్గట్టే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు నేను ‘ఏ మంత్రం వేశావె’, ‘ట్యాక్సీవాలా’, ‘మహానటి’లో నటిస్తున్నాను.  ‘మహానటి ’‌లో నేను, సమంత జర్నలిస్టు పాత్రల్లో నటిస్తున్నాం. నా పాత్ర చిన్నదైన  ఓ గొప్ప నటి జీవితాధారంగా తీస్తున్న చిత్రం కాబట్టి నటిస్తున్నాను. ‘అర్జున్ రెడ్డి ’ సినిమాకి సీక్వెల్ వస్తుందా ? అని చాలా మంది అడుగుతున్నారు. ఈ సినిమా చేస్తున్నప్పుడే నేను, సందీప్ వంగా చర్చించే వాళ్లం. ఈ పాత్ర గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడైతే సీక్వెల్  తీసే  ఆలోచన లేదు. ఇటీవల నేను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాను. అది కూడా మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా. ఇది మాత్రం మర్చిపోలేని విషయం’ అని విజయ్ చెప్పాడు.