బాహుబలి రచయిత.. ఆరెస్సెస్‌పై సినిమా - MicTv.in - Telugu News
mictv telugu

బాహుబలి రచయిత.. ఆరెస్సెస్‌పై సినిమా

March 13, 2018

బాహుబలి, బజరంగీ భాయిజాన్ సినిమాలతో ప్రపంచ మార్కెట్‌ను తన వైపు తిప్పుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆయనతో కథారచన చేయించుకుంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చాలా మంది దర్శక, నిర్మాతలకు బలమైన నమ్మకం కుదిరింది.అలాంటి చేయి తిరిగిన రచయితతో పని చేయాలని ప్రతీ ఒక్కరు ఉవ్విళ్లూరుతుంటారు. ఇప్పుడు ఆ కోవలోకి బీజేపీ పార్టీ వచ్చి చేరింది. ఆయనతో కలం పట్టించి ఆర్ఎస్ఎస్ మీద మంచి కథ రాయించుకోవాలని అనుకుంటోంది.  రూ. 100 కోట్ల బడ్జెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాలని బీజేపీ భావిస్తోంది.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులు, సాధించిన విజయాలు, ఆరెస్సెస్ గొప్పతనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందుకు సంబంధించిన కథను వండి వార్చే బాధ్యతను విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించింది బీజేపీ. ఇప్పటికే ఆయన కథారచనకు పూనుకున్నారని సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర తారలు నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ రాణి లక్ష్మీబాయి జీవిత కథతో రూపొందుతున్న ‘ మణికర్ణిక ’ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.