మహారాష్ట్ర  రైతు ఉద్యమానికి  ఆజ్యం పోసింది అతడే ! - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర  రైతు ఉద్యమానికి  ఆజ్యం పోసింది అతడే !

March 13, 2018

ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది అంటారు. 50 వేల మంది రైతుల మహా ఉద్యమం వెనుక కూడా  ఓ వ్యక్తి ఉన్నాడు. అతని పోద్భలంతోనే మహారాష్ట్ర రైతులు మహా శక్తిగా మారారు. కాళ్లు బొబ్బలెక్కినా..పగిలి బీడు భూమిగా మారినా  కూడా వెనుకడుగు వేయకుండా 180 కిలో మీటర్లు లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. అతనే విజూ కృష్ణన్ (44). అన్నదాతల సమస్యలను చూసి నిత్యం మథనపడేవాడు.  అతనిలో పుట్టిన ఆ మథనమే రైతులకు అండయ్యింది. సర్కార్‌తో తాడో పేడో తేల్చుకోవడానికి ధైర్యాన్ని నూరి పోసింది.

రైతుల లాంగ్ మార్చ్ వెనుక కీలక పాత్ర పోషించిన విజూ కృష్ణన్ ప్రస్తుతం  అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కేరళలోని కన్నూర్ జిల్లా కరివెల్లూరు  అతని స్వగ్రామం. రైతుల కష్టాను అతని చిన్నప్పటినుండే కళ్లారా చూశాడు. 1946లో బ్రిటీష్ పాలకులకు ఎదురు తిరిగి తమ హక్కుల కోసం పోరాటం చేసిన రైతుల ధైర్యం అతన్ని ఆలోచింపజేసింది. అలా కాలక్రమంలో  ఇప్పుడు రైతులకు జరగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక పోయాడు. అందుకే రైతులందరిని ఒక చోటకు చేర్చి మహా ఉద్యమంగా మారడానికి కృషి చేశాడు.

ఈరోజు దేశం మొత్తం మహారాష్ట్ర వైపే చూస్తుందంటే ఆ రైతులలో నింపిన అతని  ధైర్యమే కారణం. మహారాష్ట్ర తరహాలో దేశంలోని రైతులందరు తమ సమస్యల కోసం ఏకమై పోరాడాలని ఆయన ఆకాంక్ష. రైతు కార్యకర్తగా సేవలు అందించేందుకు గతంలో ఉద్యోగాన్ని కూడా వదిలేశారు ఆయన . రైతన్నల కోసం ఇంతగా పాటు పడుతున్న ఆయన గొప్ప మనసుకు  సలాం చేయాల్సిందే.