గత రెండు మూడు రోజుల్నుండి ఓ మళయాల సినిమా సాంగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఆ క్లిప్పులో కనిపించిన అమ్మాయి హావాభావాలకు ఫిదా అయిపోతున్నారు. అందులో అబ్బాయి అమ్మాయిని చూసి కనుబొమ్మ ఎగరేస్తే అమ్మాయి రెండు కనుబొమ్మలు ఎగరేస్తుంది. ఆ అబ్బాయి మళ్ళీ తన కనుబొమ్మలు ఎగరేస్తే అమ్మాయి కన్ను కొట్టగానే అబ్బాయి షాక్ అయి ఫ్రెండు వీపులో ముఖం దాచుకుంటాడు. సరిగ్గా ఇంతే వుంది ఆ క్లిప్పులో. కానీ చాలా మంది కుర్రాళ్ళ మతులు పోగొట్టిందనే చెప్పుకోవాలి. చాలా మంది ఆ క్లిప్‌ను తమ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుంటున్నారు. కొందరు ఆ అమ్మాయి ఫోటోను ఎఫ్బీ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటున్నారు. ‘ ఎవర్రా గీ పోరీ పిచ్చెక్కిస్తోంది ’ అని కామెంట్లు చేస్తున్నారు.
అమ్మాయి అచ్చం మరాఠీ సినిమా ‘ సైరాట్ ’ హీరోయిన్లా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందంటున్నారు నెటిజనులు. విపరీతమైన షేర్లు అయిన వీడియో క్లిప్‌గా రికార్డ్ నెలకొల్పింది. ఇంతకీ ఈ క్లిప్ మలయాళం సినిమా ‘ ఓరు అదార్ లవ్ ‘ లోని ‘ మానిక్యా మలారాయ పూవి ‘ అనే సాంగ్లోనిది. ఆ అమ్మాయి పేరు ప్రియా ప్రకాశ్ వారియర్. సినిమా విడుదలకు ముందే ఆ అమ్మాయికి చాలా క్రేజ్ వచ్చింది. యాభై లక్షల వీక్షకులకు చేరువలో వుంది వీడియో సాంగ్.