అనాథ పిల్లలను కొట్టి, గుండు గీయించిన ట్యూటర్, వాచ్‌మెన్‌లు - MicTv.in - Telugu News
mictv telugu

అనాథ పిల్లలను కొట్టి, గుండు గీయించిన ట్యూటర్, వాచ్‌మెన్‌లు

February 22, 2018

ఆనాథ పిలలకు సంరక్షణ కల్పించాల్సిన వారే అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. భోజనం బాగలేదని,ఎందుకు ఇలాంటి భోజనం పెట్టారని ప్రశ్నించడమే వారి తప్పు అయింది. ఆ ఆనాథ పిల్లలను దారుణంగా కొట్టి ,అతంటితో ఆగకుండా వారికి గుండు గీయించారు. ఈ  అమానుషమైన సంఘటన వరంగల్  అర్బన్ జిల్లాలోని హన్మకొండలోని లష్కర్ బజార్‌లో జరిగింది.

లష్కర్‌ బజార్‌లోని ప్రభుత్వ పట్టణ వీధి బాలల వసతి గృహంలో సుమారు వంద మంది అనాథ విద్యార్థులు ఉన్నారు. పిల్లలందరూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. అయితే వారం రోజుల నుంచి హాస్టల్ వార్డెన్ అర్చన వ్యక్తిగత సెలవుల్లో ఉంది. కాగా వసతి గృహం బాధ్యతలను  ట్యూటర్‌ రాజు, వాచ్‌మెన్‌ జవహార్‌లే  చూసుకుంటున్నారు.  అయితే నీళ్ల చారు, సరిగా ఉడకని అన్నాన్ని వడ్డించడంపై రెండు రోజుల క్రితం కల్యాణ్, దిలీప్, అక్షయ్‌వర్మ అనే విద్యార్థులు ట్యూటర్, వాచ్‌మెన్‌లను నిలదీసీ అడిగారు.

దాంతో  ‘ మమ్మల్నే అడుగుతార్రా ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఆ ముగ్గురు విద్యార్థులను చితకబాదారు. అయినప్పటికీ శాంతించని వాచ్‌మన్, ట్యూటర్‌లు ఆ ముగ్గురికి గుండు చేయించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా  ఏబీఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎస్‌బీ, డీఎస్‌యూ విద్యార్థి సంఘాలు బుధవారం సాయంత్రం వసతి గృహం ఎదుట ధర్నా నిర్వహించాయి.

ఈ సందర్భంగా ఏబీఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్‌ మాట్లాడుతూ ట్యూటర్, వాచ్‌మన్‌లను విధుల నుంచి తొలగించాలని, మెనూ ప్రకారం  విద్యార్థులకు భోజనం వడ్డించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన ఉధృతం కాకుండా బందోబస్తు  చర్యలను తీసుకున్నారు.  విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ట్యూటర్‌ను ,వాచ్‌మెన్‌లపై సస్పెండ్ వేటు పడింది.