మాల్యా అప్పుల చిట్టా సర్కారు వద్ద లేదంట! - MicTv.in - Telugu News
mictv telugu

మాల్యా అప్పుల చిట్టా సర్కారు వద్ద లేదంట!

February 7, 2018

తీసుకున్న అప్పులను తీర్చకుండా తాపీగా ఎగ్గొట్టిన  విజయ్ మాల్యా  విదేశాల్లో సేదదీరుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అది నిజం కాదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. పలు బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా రుణాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవని కేంద్ర సమాచార కమిషన్‌ ( సీఐసీ )కి చెప్పింది.

మాల్యా రుణాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ రాజీవ్‌ కుమార్‌ ఖరే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్థికశాఖకు దరఖాస్తు చేయడంతో ఆర్థిక శాఖ పై విధంగా స్పందించింది. రాజీవ్ వారి మాటలు నమ్మకుండా గట్టిగా అడగటంతో వారు రూల్స్ గురించి ప్రస్తావించారు.  వ్యక్తిగత భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే వివరాలు ఇవ్వకుండా ఆర్టీఐ చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయని తెలపడంతో రాజీవ్‌ సీఐసీని ఆశ్రయించారు.ఈ విషయమై సీఐసీ ప్రశ్నించినా.. మాల్యా రుణాలకు సంబంధించిన రికార్డులేవీ తమ వద్ద లేవని ఆర్థిక శాఖ అదే దిగదుడుపు సమాధానం చెప్పింది. ‘  మాల్యా వివరాలు తమ వద్ద లేవని చెబుతున్న ఆర్థికశాఖ గతంలో ఈ వివరాలను పార్లమెంట్‌లో ఎలా ప్రస్తావించగలిగింది ? ’ అని సీఐసీ అడిగిన ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేకుండా పోయింది.

మాట దాటవేస్తూ.. ‘ ఆ వివరాలు మా దగ్గర కాకుండా ఆయా బ్యాంకులు లేదా రిజర్వ్ బ్యాంక్‌ను ఆశ్రచించాలి ’ అని సలహా ఇచ్చారు. ఆర్థికశాఖ సమాధానంపై సీఐసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక నేరస్తుడికి కొమ్ము కాస్తున్నట్టు.. చట్టప్రకారం వారి జవాబు సబబు కాదని పేర్కొంది. కాగా రాజీవ్‌ దరఖాస్తును సంబంధిత పబ్లిక్‌ అథారిటీకి బదిలీ చేయాలని సూచించింది.