మందుకు డబ్బువ్వలేదని.. ఫైరింజన్లు.. పోలీసులు.. - MicTv.in - Telugu News
mictv telugu

మందుకు డబ్బువ్వలేదని.. ఫైరింజన్లు.. పోలీసులు..

February 3, 2018

తాగటానికి ఇంట్లో డబ్బులివ్వలేదనే కోపంతో వాటర్ ట్యాంక్ ఎక్కి కిందికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నడో తాగుబోతు ప్రబుద్ధుడు. చిత్తూరు జిల్లా నగరి మండలం కేవీబీఆర్ పేటకు చెందిన దొరైరాజ్ ఈ పనికి ఒడిగట్టాడు. నగరి మండలం కేవీబీఆర్‌పేటకు చెందిన నేత కార్మికుడు సుబ్రహ్మణ్యం కుమారుడు దొరైరాజ్‌ తమిళనాడులో డిప్లొమా పూర్తి చేశాడు. అతనికి జులాయి స్నేహితులు ఎక్కువగా వుండటం వల్ల తాగుడుకు అలవాటు పడ్డాడు. అలా అతను మందు లేనిది ఒక్క పూట కూడా వుండలేనంత మద్యానికి బానిసయ్యాడు.ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మద్యం కోసం ఇంట్లో డబ్బులడిగాడు. ఇంట్లోవాళ్లు డబ్బులు ఇవ్వకపోవటంతో వాగ్వాదానికి దిగాడు. కోపంగా రాత్రి 8 గంటలకు దగ్గర్లోని తాగునీటి ట్యాంకు ఎక్కాడు. వెంటనే చుట్టు పక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. నగరి అగ్నిమాపక శాఖ అధికారి మాబూసుభాన్‌ సిబ్బందితో ట్యాంకు వద్దకు చేరి యువకుడికి నచ్చజెప్పి కిందకు దించారు. తరువాత పోలీసులకు అప్పగించారు. తరువాత దొరైరాజ్‌కు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహించారు. చుట్టుపక్కల వాళ్లు చూడడం… అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం.. వారు సకాలంలో స్పందించడంతో కథ సుఖాంతమైంది.