mictv telugu

ఆ ఇంట్లో రూ. 200 కోట్లు.. చివరికి ఏమైంది?

December 6, 2018

ఇదిగో పాము అదిగో పడగ అన్న తీరులో వుంది ప్రస్తుత పరిస్థితి.  దొరికిందే సందు అన్నట్టు కొందరు ఆకతాయిలు పోలీసులకు అబద్ధపు సమాచారాలు ఇచ్చి ముప్పతిప్పలు పెడుతున్నారు. ఓ ఇంట్లో వేలు కాదు, లక్షలు కాదు రూ.200 కోట్ల డబ్బును అట్టపెట్టెల్లో దించామని వ్యక్తి నంద్యాల తాలూకా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆఘమేఘాల మీద వెళ్లి సోదాలు నిర్వహించారు. సినీ ఫక్కీలో జరిగింది ఈ తతంగమంతా. కానీ అక్కడ చిల్లిగవ్వా లభ్యం కాలేదు. విస్మయానికి గురిచేస్తున్న ఈ ఘటన నంద్యాల నియోజకవర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివవాల ప్రకారం..Telugu news We have Rs 200 crores in that house ...... Suspense thrillerనంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన రఘురామిరెడ్డి, రామచంద్రారెడ్డి ఇంట్లో రూ.200 కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో దాచి వుంచినట్టు మండలంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన శంకర్రెడ్డి బుధవారం పోలీసులకు సమాచారంఅందించాడు. అనుమానం కలిగిన సీఐ అతణ్ణి ఆరా తీశాడు. అంత డబ్బు అక్కడికెలా వస్తుందని ప్రశ్నించారు. అందుకు అతను వజ్రాల వ్యాపారం చేస్తారని, డబ్బు దింపడానికి తనను కూడా రమ్మన్నారని, అయితే తాను వెళ్లలేదని చెప్పాడు. అక్కడికి వెళ్లినవారిలో తనకు తెలిసినవారు వున్నారని, వారు చెప్పినట్టు 20 రోజుల క్రితం  ఇంట్లో డబ్బు దింపారని నమ్మకంగా చెప్పడంతో పోలీసులు నమ్మారు.

ముందుగా కొంతమంది పోలీసులో రెక్కీలో అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఆ ఇంటి తలుపులకు రెండేసి తాళాలు వేసి వున్నాయి. దీంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది. వెంటనే రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇంటి తాళాలు పగులగొట్టారు. ఇంట్లో మూడు వాకిళ్లు ఉండగా ఒక్కొక్క వాకిలికి రెండేసి తాళాలు వేసి ఉన్నాయి. తాళాలన్నీ పగులగొట్టి సోదాలు చేయగా వారికి చిల్లిగవ్వా కూడా లభించలేదు.

పోలీసు సోదాల విషయం తెలిసి గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చారు. పోలీసులను పక్కదారి పట్టించడానికే శంకర్రెడ్డి అలా  సమాచారం ఇచ్చాడా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంటికి రెండేసి తాళాలు ఎందుకు వేసి వున్నాయన్నది పోలీసులకు అంతు చిక్కకుండా మారింది ? ఇంటి యజమానులకు ఫోన్ చేస్తే ఇద్దరివీ స్విచ్ఆఫ్ వస్తున్నాయని సీఐ రవిశంకర్రెడ్డి తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చిన శంకర్రెడ్డిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.