కులాంతర పెళ్లి.. చంపేస్తామంటూ బెదరింపులు - MicTv.in - Telugu News
mictv telugu

కులాంతర పెళ్లి.. చంపేస్తామంటూ బెదరింపులు

March 2, 2018

ప్రేమకు కులమతాలు, ప్రాంతీయ విబేధాలు వుండవు అంటారు. కానీ వీరి ప్రేమకు కులం కుంపటి పెట్టింది. తమ కూతురు వేరే మతస్తుణ్ణి పెళ్లి చేసుకోవటంతో ఆమె తరపువాళ్ళు చంపేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో  ఆ ప్రేమజంట భయంతో బతుకుతోంది. విశాఖపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాల సంగీత, సంతోష్ బాబు కలిసి విశాఖలోని వీజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మహిళా చేతన్ అధ్యక్షురాలు కత్తి పద్మతో కలిసి వివరాలు వెల్లడించారు. చట్టబద్దంగా ఒక్కటైన మేజర్లమైన తమను తల్లిదండ్రులు వేరుచేయాలని చూడటమే కాక, హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.  బాలసంగీత నగరంలోని గాయత్రి విద్యాపరిషత్‌లో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు నగరంలోని తాటిచెట్ల పాలానికి చెందిన సంతోష్ బాబుతో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. అతను బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారిద్దరు  ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుందామనేసరికి వాళ్ళ పెద్దవాళ్ల నుండి తిరస్కారం ఎదురైంది. బాల సంగీత కుటుంబ సభ్యులు అబ్బాయి కులం వేరని చెప్పి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వాళ్ళు పెద్దలను ఎదురించి గత నవంబర్‌ 19న నగరంలో ఒక దేవాలయంలో  పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దవాళ్ళ పగ చల్లారలేదు. తరువాత ఆ ప్రేమజంట తమ పెళ్లిని చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేసుకున్నారు. కులంకానివాణ్ణి పెళ్లి చేసుకొని మా పరువు తీశావని.. మిమ్మల్ని చంపేస్తామని.. అమ్మాయి తరుపు బంధువులు బెదిరిస్తున్నారని మహిళా చేతన అధ్యక్షురాలు తెలిపారు. వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం చాలా వుంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.