ఆరేళ్లకు తిరిగొచ్చిన భర్త.. తలుపు తీయని భార్య ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆరేళ్లకు తిరిగొచ్చిన భర్త.. తలుపు తీయని భార్య !

March 12, 2018

ఆరేళ్ల క్రితం ఇల్లు వదలి వెళ్లిన తాను తిరిగి ఇంటికి వస్తే భార్య ఇంట్లోకి రావ్వడం లేదని ఓ వ్యక్తి నిరాహార దీక్షకు పూనుకున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి ప్రాంతంలో జరిగింది. ప్రవిణ్ షా అనే బ్యాంకు ఉద్యోగి చిట్‌ఫండ్ ఏజెంట్ కూడా పనిచేసేవాడు. ఆరేళ్ల క్రితం అతను పని చేస్తున్న కంపెనీలో అవినీతి జరగడంతో ప్రవీణ్ డబ్బులు పోగోట్టుకున్నాడు. అప్పులు చెల్లించలేక భయపడి ఇల్లు వదలి పారిపోయాడు. అప్పటికే తన పేరుతో ఉన్న ఆస్తులను భార్య పేరుపై రాసేశాడు. తీరా ఇప్పుడు భార్యపై ప్రేమతో ఇల్లు వెతుక్కుంటూ వస్తే  భార్య అతన్ని ఇంటిలోకి రానివ్వకుండా అడ్డుకుంది. దాంతో ఏం చేయాలో తెలియక ఇంటి ముందే నిరాహార దీక్షకు దిగాడు.

‘ఇబ్బందులతో ఇల్లు విడిచి వెళ్లేప్పుడు నా ఆస్తులన్నీ భార్య పేరిటే రాసేశాను. అలాంటి నన్నే ఇంట్లోకి రానివ్వడం లేదు. ఇదెక్కడి న్యాయం? మీరే తీర్పు చెప్పండి..  రాత్రిళ్లు రైల్వే స్టేషన్లు, గుళ్లలో పడుకుంటున్నాను. నన్ను లోపలికి రానిచ్చే వరకు నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాను. ఆమెకు మరొకరితో సంబంధం ఉంది. అందుకే నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

విషయం తెలిసి స్థానిక అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ప్రవీణ్‌ భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె తలుపులన్నీ మూసేసుకుని లోపలే ఉండిపోయింది. కొందరు వ్యక్తులు ప్రవీణ్‌ నిరాహార దీక్ష చేస్తున్న  వీడియో తీశారు. దానిని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.