ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదైనది. ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం ముగిసిన మూడో టెస్టులో ఈ రికార్డు నమోదైనది. ఆ టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు కలిపి మొత్తం 38 వైడ్లు విసిరారు. దీంతో దశాబ్దం క్రితం వెస్టిండీస్-ఆస్ట్రేలియా నమోదు చేసిన అత్యధిక వైడ్ల రికార్డు బద్ధలైంది. 2008 జూన్‌లో బ్రిడ్జిటౌన్లో జరిగిన మ్యాచ్‌లో విండిస్-ఆస్ట్రేలియన్ బౌలర్లు కలిపి మొత్తం 34 వైడ్లు వేశారు. వైడ్ల రూపంలో ఎక్కువ ఎక్స్ట్రా పరుగులిచ్చిన రెండు టెస్టుల్లోనూ వెస్టిండీస్ బౌలర్లు భాగం కావడం విశేషం.
తాజా మ్యాచ్‌లో భాగంగా నాలుగో రోజు ఆటలో వెస్టిండీస్ బౌలర్ కీమర్ రోచ్ వేసిన ఐదో బంతిని వైడ్‌గా వేశాడు. అది రోచ్‌కు ఇన్నింగ్స్‌లో రెండో వైడ్. దాంతో గత వైడ్ల రికార్డు సమం అయ్యింది. ఆపై వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ చేపట్టిన క్రమంలో ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ 14 ఓవర్లో వైడ్ వేశాడు. ఫలితంగా 35 వైడ్లతో రికార్డును ఇరు జట్లు మూటగట్టుకున్నాయి. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో మూడు వైడ్లు వేయడంతో మొత్తంగా 38 వైడ్లు పడ్డాయి. ఇక్కడ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి వెస్టిండీస్ 24 వైడ్లు వేయగా, ఇంగ్లండ్ 14 వైడ్ బాల్స్ వేసింది. ఇక అత్యధిక వైడ్లు వేసిన జాబితాలో మూడో స్థానంలో దక్షిణాఫ్రికా-భారత్ జట్లు నిలిచాయి. గతేడాది జోహనెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో ఇరు జట్లు 33 వైడ్లు వేశాయి.Telugu News West Indies, England bowlers bowl most number of wides in a Test match